బాసర ట్రిపుల్​ ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య

బాసర ట్రిపుల్​ ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య
  •  వ్యక్తిగత కారణాలతోనే అంటున్న వర్సిటీ అధికారులు 
  • హాజరు శాతం లేదని పేరెంట్స్​కు ఫోన్ చేసిన వర్సిటీ ఆఫీసర్లు ​  
  • ఇంటికి తీసుకెళ్లమని చెప్పడంతో మనస్తాపంతోనే సూసైడ్​? 

భైంసా/బాసర, వెలుగు : నిర్మల్​ జిల్లా బాసర ట్రిపుల్​ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం బండారుపల్లికి చెందిన అరవింద్ ​బాసర ట్రిపుల్​ఐటీలో పీయూసీ సెకండ్​ఇయర్​చదువుతున్నాడు. మంగళవారం తోటి స్టూడెంట్స్​ క్లాస్​లకు వెళ్లగా..అరవింద్​ హాస్టల్​గదిలోనే ఉండిపోయాడు. తర్వాత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తరగతులు పూర్తయిన తర్వాత తోటి విద్యార్థులు హాస్టల్​ గదికి రాగా.. అరవింద్​ వేలాడుతు కనిపించాడు. వెంటనే హాస్పిటల్​కు తరలించగా అప్పటికే చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు. వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని వర్సిటీ ఆఫీసర్లు చెబుతున్నారు. ముథోల్​ సీఐ మల్లేశ్, ఎస్సై గణేశ్​ఘటనా స్థలాన్ని పరిశీలించారు.  

అటెండెన్స్ శాతం తక్కువే కారణమా?

అరవింద్​ పీయూసీ- సెకండ్​ ఇయర్​ చదువుతుండగా ఈ నెల17 నుంచి పరీక్షలున్నాయి. వర్సిటీ ఆఫీసర్లు 75 పర్సెంట్​అటెండెన్స్​ఉన్న స్టూడెంట్స్​ను మాత్రమే పరీక్షలకు అనుమతిస్తున్నారు. రెండు రోజుల క్రితం హాజరు శాతం తక్కువగా ఉన్న వంద మందికి పైగా విద్యార్థుల లిస్ట్​ను కాలేజీ నోటీస్​బోర్డుపై పెట్టారు. ఇందులో పేర్లున్న స్టూడెంట్ల పేరెంట్స్​కు ఫోన్లు చేసి ఇండ్లకు తీసుకెళ్లాలని చెప్పినట్టు తెలిసింది. ఇందులో అరవింద్ ​పేరు కూడా ఉండడం, వారి పేరెంట్స్​కు కూడా చెప్పడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఐదు నెలల్లో ముగ్గురు

ట్రిపుల్​ఐటీలో గత ఐదు నెలల్లో ముగ్గురు విద్యార్థులు సూసైడ్ ​చేసుకున్నారు. గత ఏడాది నవంబర్​లో ఫస్ట్​ఇయర్ ​చదువుతున్న నాగర్​కర్నూల్​కు చెందిన ప్రవీణ్​కుమార్​, ఈ ఏడాది ఫిబ్రవరిలో సంగారెడ్డి జిల్లాకు చెందిన పీయూసీ- ఫస్టియర్​చదువుతున్న శిరీషా హాస్టల్​గదుల్లోనే ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా అరవింద్​కూడా ఆత్మహత్య చేసుకోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇన్​చార్జి వీసీ వెంకటరమణ హైదరాబాద్​లో ఉంటూ నెలకు ఒకటి, రెండు సార్లు వచ్చి పోతుండడం, ఇంతకు ముందు డైరెక్టర్​ సతీశ్​కుమార్​పదవీ కాలం ముగియడంతో పర్యవేక్షణ కరువైందంటున్నారు. 

కలెక్టర్​, ఎస్పీ సీరియస్..

ఆత్మహత్య విషయం తెలియడంతో నిర్మల్​కలెక్టర్​ఆశిష్​ సాంగ్వాన్​, ఎస్పీ జానకి షర్మిల ట్రిపుల్​ఐటీకి చేరుకున్నారు. అరవింద్​గదిని పరిశీలించారు. వర్సిటీ ఆఫీసర్లతో మీటింగ్ ​నిర్వహించి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థి క్లాస్​రూమ్​కు వెళ్లకుండా హాస్టల్​గదిలో ఉంటే వార్డెన్ ​ఏం చేస్తున్నారని ఫైర్​ అయ్యారు. విద్యార్థి అటెండెన్స్​ తక్కువగా ఉన్నప్పుడు ఔట్​పాస్​లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఆత్మహత్యపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. గతంలో జరిగిన ఘటనలు, తీసుకున్న చర్యలపై రిపోర్ట్​ అందజేయాలన్నారు. స్టూడెంట్స్​ను గ్రూపులుగా విభజించి, వారికి ఒక ఫ్యాకల్టీని కేటాయించాలన్నారు. బైంసా ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్, ట్రీపుల్​ఐటీ అధికారులు మహేష్, చంద్రశేఖర్, పావని, వినోద్, శ్రీధర్ పాల్గొన్నారు.