ప్రపంచంలో మరో యుద్ధం : పాలస్తీనాపై ఇజ్రాయిల్ యుద్ధ విమానాలతో దాడులు

ప్రపంచంలో మరో యుద్ధం : పాలస్తీనాపై ఇజ్రాయిల్ యుద్ధ విమానాలతో దాడులు

ఇజ్రాయెల్ సైన్యం వెస్ట్ బ్యాంక్ లోని జెనిన్ నగరంపై వరుస దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో నలుగురు మరణించారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఇజ్రాయెల్ ఈరోజు జెనిన్ నగరంపై దాదాపు 10 సార్లు వైమానిక దాడులు నిర్వహించింది. ఈ ఘటనలో తెల్లవారుజామున ముగ్గురు మరణించగా, ఉదయం 10:30 గంటల ప్రాంతంలో మరొకరు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. ఈ మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ దాడుల్లో ఇప్పటి వరకు దాదాపు 13 మంది పాలస్తీయన్లు గాయాల పాలయ్యారని, వారి పరిస్థితి విషమంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. ఇజ్రాయెల్ దాడులకు జెనిన్ బెటాలియన్ స్పందించింది. ఏది ఏమైనా చివరి శ్వాస వరకు, చివరి బుల్లెట్ వరకు ఆక్రమణ దళాలతో పోరాడతామని స్పష్టం చేసింది. అందుకోసం తామంతా కలిసి ఐక్యంగా వస్తామని చెప్పుకొచ్చింది.

గత నెలలో ఇదే తరహాలో జెనిన్ నగరంలో జరిగిన దాడిలో ఆరుగురు పాలస్తీయన్లు మరణించారు. ఏడుగురు ఇజ్రాయెల్ సైనికులతో పాటు సరిహద్దు పోలీసులు గాయపడ్డారు.