IPL 2024: 4 ఓవర్లలో 102 పరుగులు.. ఢిల్లీని ముంచుతున్న సఫారీ పేసర్

IPL 2024: 4 ఓవర్లలో 102 పరుగులు.. ఢిల్లీని ముంచుతున్న సఫారీ పేసర్

దక్షిణాఫ్రికా పేసర్ ఆన్రిచ్ నోకియా ఐపీఎల్ లో మంచి రికార్డ్ ఉంది. కొన్ని సీజన్ ల పాటు ఢిల్లీ క్యాపిటల్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. పేసర్ రబడాతో  కలిసి ప్రత్యర్థుల జట్లను చిత్తు చేసేవాడు. పదునైన పేస్ తో పాటు.. యార్కర్లతో బయపెట్టేవాడు. అయితే ఇదంతా ఒకప్పటి మాట. అప్పట్లో ఆదుకున్నవాడే ఇప్పుడు జట్టును నిండా ముంచేస్తున్నాడు. స్టార్ బౌలర్ అని జట్టులో అవకాశమిస్తే తేలిపోతున్నాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో నోకియా దారుణంగా విఫలమవుతున్నాడు. 

ఇన్నింగ్స్ కు కీలకమైన 20 ఓవర్లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్ ల్లో ఏకంగా 102 పరుగులు ఇచ్చేశాడు. గాయంతో తొలి మ్యాచ్ ఆడని ఈ సఫారీ పేసర్.. ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్ ల్లో చెత్త ప్రదర్శన చేశాడు. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో 20 ఓవర్లో పరాగ్ విధ్వంసంతో 25 పరుగులు పిండుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ పై ధోనీ 2 ఫోర్లు, 2 సిక్సులతో 20 పరుగులు బాదేశాడు. ఇక కేకేఆర్ పై ఆడిన మ్యాచ్ లో రింకూ సింగ్ బౌండరీల వర్షం కురిపించడంతో 25 పరుగులు వచ్చాయి. 

తాజాగా నిన్న (ఏప్రిల్ 7) నిన్న ముంబైతో జరిగిన మ్యాచ్ లో వెస్టిండీస్ ఆల్ రౌండర్ షెపర్డ్ చివరి ఓవర్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ప్రతి బంతిని బౌండరీకు తరలిస్తూ 32 పరుగులు రాబట్టాడు. విదీశీ బౌలర్ గా నోకియా మీద భారీ అంచనాలు ఉన్నాయి. చివరి ఓవర్లో భారీగా పరుగులు ఇస్తున్న ఢిల్లీ ఇతనిపై నమ్మకముంచుతుంది. అయితే ఈ సఫారీ బౌలర్ మాత్రం నా తీరు మారదని భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. దీంతో నోకియాపై సోషల్ మీడియాలో సెటైర్ల వర్షం కురుస్తుంది. "దయచేసి నన్ను దక్షిణాఫ్రికా పంపండి" అంటున్న ఒక మీమ్ తెగ వైరల్ అవుతుంది.