క్యాన్సర్ నివారణ నకిలీ మందుల తయారీ ముఠా గుట్టు రట్టు..

క్యాన్సర్ నివారణ నకిలీ మందుల తయారీ ముఠా గుట్టు రట్టు..

రాష్ట్ర చరిత్రలోనే క్యాన్సర్ నివారణకు ఉపయోగించే అతిపెద్ద నకిలీ మందుల తయారీ ముఠాను హైదరాబాద్ లోని మచ్చ బొల్లారంలో  తెలంగాణ ర్రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అధికారులు గుర్తించి పట్టుకున్నారు. నిందితుల నుంచి దాదాపు రూ.4 కోట్ల 35 లక్షల విలువైన నకిలీ క్యాన్సర్ నివారణ మందులను స్వాధీనం చేసుకున్నట్లు డ్రగ్స్ కంట్రోల్ విభాగం డైరెక్టర్ జనరల్ వీ.బి. కమలాసన్ రెడ్డి తెలిపారు. 

డీజీ కమలాసన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..  ఆస్ట్రిక హెల్త్ కేర్ అనే కంపెనీ క్యాన్సర్ నివారణకు ఉపయోగించే మందులను.. నకిలీ, కల్తీ మందులను తయారు చేసి మార్కెట్ లో విక్రయిస్తున్నట్టు సమాచారం అందడంతో డిసెంబర్ 2వ తేదీన డ్రగ్స్ కంట్రోల్ విభాగానికి చెందిన విజిలెన్స్ ప్రత్యేక బృందాలు హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించాయని చెప్పారు. 

ఈ నకిలీ మందుల చెలామణికి సంబందించిన ఇన్వాయిస్ ల ద్వారా, పోస్టల్ శాఖ  ద్వారా.. కంపెనీ చిరునామా కోసం ఆల్వాల్ లో వెతకగా.. అది తప్పుడు అడ్రస్ గా నిర్దారణ అయిందని చెప్పారు.  అనంతరం,  ఐడిఎ చర్లపల్లి, నాచారం, మేడ్చల్ లలోని వివిధ కొరియర్ కార్యాలయాలను తనిఖీ చేసి ఆస్ట్రిక హెల్త్ కేర్ ద్వారా పంపిణీ అయినవాటిని తనిఖీ చేయడం జరిగిందని తెలిపారు.  డ్రగ్స్ కంట్రోల్ విభాగానికి చెందిన విజిలెన్స్ మరొక ప్రత్యేక బృందం కీసరలోని ఆస్ట్రిక హెల్త్ కేర్ సంస్థపై దాడులు నిర్వహించడం జరిగిందని తెలిపారు.  'ఆస్ట్రికా హెల్త్‌కేర్'  నుండి నకిలీ డ్రగ్ స్టాక్ డెలివరీ చేస్తున్న కొరియర్ బాయ్‌ ద్వారా మచ్చ బొల్లారం వద్ద మూడు షట్టర్లలో ఈ నకిలీ మందులు నిల్వ చేయబడ్డాయని డీసీఏ అధికారులు గుర్తించారు. 

డిసెంబర్ 4 న ఈ నకిలీ మందుల తయారీ  స్థావరాలపై దాడి చేసి రూ.4 కోట్ల 35 లక్షల విలువైన  36 రకాల క్యాన్సర్‌ నివారణ మందులు, ఇతర మందులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  పట్టుకున్న కొన్ని మందులలో నకిలీ స్వభావం కలిగి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కె. సతీష్ రెడ్డి, ఆస్ట్రికా డైరెక్టర్ హెల్త్‌కేర్ పరారీలో ఉన్నారని చెప్పారు. నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు డీజీ కమలాసన్ రెడ్డి తెలిపారు.