- వెంటనే దీన్ని రద్దు చేయాలి
ముషీరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన యాంటీ కన్వర్షన్ బిల్లును వెంటనే రద్దు చేయాలని ది నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ ఇండియన్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ డిమాండ్ చేసింది. బుధవారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద క్రిస్టియన్ మైనార్టీలు భారీ నిరసన చేపట్టారు. ఆర్గనైజేషన్ ప్రతినిధులు సి.ఎ. డేనియల్ ఆడమ్స్, జెరూసలేం మత్తయ్య, బిషప్ విల్సన్ సింగం మాట్లాడుతూ.. ఈ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమన్నారు.
ఈ బిల్లుపై సుప్రీంకోర్టులో పోరాడుతున్న పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్యను తీవ్రంగా ఖండించారు. ఈ హత్య వెనుక ఉన్న కుట్రను ఛేదించేందుకు సిట్టింగ్ జడ్జితో జ్యుడీషియల్ ఎంక్వయిరీ జరిపించాలని, మృతదేహానికి వెంటనే రీ-పోస్టుమార్టం నిర్వహించాలని డిమాండ్ చేశారు.
బషీర్బాగ్: కేవలం మైనారిటీలను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే ఇలాంటి చట్టాలను తీసుకొస్తున్నారని, ఇది రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ హక్కుకు విరుద్ధమని క్రిస్టియన్ డెమొక్రటిక్ మూమెంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు పి.ఎ. మెల్కిసెదెక్ అన్నారు.
బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ.. సెక్యులర్ దేశంలో ఇలాంటి ఆంక్షలు విధించడం దారుణమని, అమెరికా వంటి దేశాల్లో మనవారు ఆలయాలు నిర్మిస్తున్నా అక్కడి ప్రభుత్వాలు అడ్డుకోవడం లేదని గుర్తు చేశారు.
