భార్యతో కలిసి అయోధ్య హనుమాన్ గర్హి ఆలయంలో కోహ్లీ పూజలు

భార్యతో కలిసి అయోధ్య హనుమాన్ గర్హి ఆలయంలో కోహ్లీ పూజలు

లక్నో: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఉత్తరప్రదేశ్‎ అయోధ్యలోని హనుమాన్ గర్హి ఆలయాన్ని సందర్శించారు. ఆదివారం (మే 25) భార్య అనుష్క శర్మతో కలిసి హనుమాన్ ఆలయానికి వెళ్లిన కోహ్లీ దంపతులకు అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కోహ్లీ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.

కోహ్లీ, అనుష్క దంపతులు హనుమాన్ గర్హి ఆలయాన్ని సందర్శించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి. ఈ నెల (మే) ప్రారంభంలో కూడా కోహ్లీ, అనుష్క జోడీ.. స్వామిజీ  ప్రేమానంద్ జీ మహారాజ్ నుంచి ఆశీర్వాదం పొందడానికి బృందావనాన్ని సందర్శించిన విషయం తెలిసిందే. 

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతుల ఆలయ సందర్శన గురించి సంజయ్ దాస్ జీ మహారాజ్ మాట్లాడుతూ.. విరాట్, అనుష్క శర్మలకు ఆధ్యాత్మికత, సంస్కృతి, దేవుడు, సనాతన ధర్మం పట్ల లోతైన ప్రేమ ఉందన్నారు. వారు రామలల్లాను సందర్శించి హనుమంతుడి ఆశీర్వాదం తీసుకున్నారని తెలిపారు. కోహ్లీ దంపతులు ఇక్కడి ఆధ్యాత్మికత, పౌరాణిక విషయాలను కూడా అడిగి తెలుసుకున్నారని చెప్పారు. 

ఐపీఎల్ 18లో భాగంగా మే 27న ఆర్సీబీ, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ జట్టు ఉత్తరప్రదేశ్‎లోనే ఉంది. మ్యాచుకు మరో రెండు రోజుల సమయం ఉండటంతో కోహ్లీ దంపతులు ఆదివారం (మే 25) చారిత్రాత్మక అయోధ్య రామమందిరాన్ని సందర్శించారు. కోహ్లీని చూసేందుకు రామమందిరం వద్ద అభిమానులు పెద్ద ఎత్తున ఎగబడ్డారు. బిజీ షెడ్యూల్‎లో కూడా ఆధ్యాత్మికత, భారత సంస్కృతి, సంప్రదాయాలకు కోహ్లీ జంట ఇస్తున్న ప్రాధాన్యతను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.