టెన్త్ మోడల్ పేపర్లపై విద్యార్థుల్లో ఆందోళన

టెన్త్ మోడల్ పేపర్లపై విద్యార్థుల్లో ఆందోళన

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో స్కూల్ ఎడ్యుకేషన్, ఎస్​సీఈఆర్టీ అధికారుల నిర్లక్ష్యంతో టెన్త్ స్టూడెంట్లలో ఆందోళన కొనసాగుతోంది. ఈ విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలను 11 పేపర్లు కాకుండా ఆరు పేపర్లకు కుదించాలని సర్కారు గతంలో నిర్ణయం తీసుకుంది. కానీ ఇప్పటికీ దానికి అనుగుణంగా మోడల్ పేపర్లు  గానీ,  బ్లూప్రింట్ ను గానీ స్కూల్ ఎడ్యుకేషన్, ఎస్​సీఈఆర్టీ అధికారులు రిలీజ్ చేయలేదు. దీంతో స్టూడెంట్లతో పాటు టీచర్లు, పేరెంట్స్​లోనూ అయోమయం నెలకొంది. అయితే పరీక్షలను ఆరు పేపర్లకు కుదించినట్లు ప్రభుత్వం అధికారికంగా జీవో ఇస్తేనే, మోడల్ పేపర్లు రిలీజ్ చేసే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలో అన్ని మేనేజ్ మెంట్ల పరిధిలో ఏటా ఐదు లక్షలకు పైగా టెన్త్  విద్యార్థులు పరీక్షలు రాస్తుంటారు. ఈ ఏడాది కూడా ఇప్పటికే 4.95 లక్షల మంది ఎగ్జామ్  ఫీజు చెల్లించారు. ప్రస్తుతం ఫైన్​ తో ఫీజు చెల్లించే అవకాశం ఈనెలాఖరు వరకు ఉంది. మార్చి/ ఏప్రిల్ లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ లెక్కన పరీక్షలకు మరో మూడు నెలల గడువు మాత్రమే ఉంది. అయినా ఇప్పటికీ క్వశ్చన్ పేపర్ మోడల్ ను ఎస్​సీఈఆర్టీ, స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు రిలీజ్ చేయలేదు. 

అయితే సమ్మెటివ్ అసెస్​మెంట్ (ఎస్​ఏ)–1 పరీక్షలను ముందుగా ఆరు పేపర్లతోనే నిర్వహించాలని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు నిర్ణయించారు. కానీ ఆరు పేపర్లతో పరీక్షలు నిర్వహించాలన్న నిర్ణయాన్న ఆలస్యంగా తీసుకోవడంతో, అప్పటికే ప్రతి యేడులాగే ఈసారి కూడా11 పేపర్లు ఉంటాయని భావించిన జిల్లా అధికారులు పేపర్లను ప్రింట్ చేయించారు. దీంతో మళ్లీ  పేపర్లు తయారుచేసి, ప్రింట్ చేయడం కష్టమని భావించి, చివరికి 11 పేపర్లతోనే ఎస్ఏ1 పరీక్షలు నవంబర్​లో నిర్వహించారు. దీంతో పబ్లిక్ పరీక్షల్లో వచ్చే పేపర్  ఏ మోడల్​లో ఉంటుందో  స్టూడెంట్లు తెలుసుకునే చాన్స్​లేకుండా పోయింది. అప్పట్లో ఎస్​సీఈఆర్టీ, స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు తీసుకున్న ఈ నిర్ణయంపై తీవ్ర విమర్శలు రావడంతో, త్వరలోనే బ్లూప్రింట్, మోడల్ పేపర్లు రిలీజ్ చేస్తామని అధికారులు ప్రకటించారు. ఈ ప్రకటన వచ్చి రెండు నెలలు కావస్తున్నా.. ఇప్పటికీ మోడల్ పేపర్లు విడుదల చేయలేదు. దీంతో స్టూడెంట్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 

ఇప్పటికైనా క్లారిటీ ఇవ్వాలె

మరోపక్క సైన్స్ సబ్జెక్టులో ఫిజిక్స్, బయోలజీలకు వేర్వేరుగా పరీక్షలు నిర్వహిస్తారా లేక ఒక్కటిగానే పెడ్తారన్న విషయంపైనా స్పష్టత లేదు. రెండు సబ్జెక్టులను వేర్వేరు టీచర్లు చెప్తుండడంతో వాల్యుయేషన్​ వేర్వేరుగా నిర్వహించాల్సి ఉంటుంది.  దీనిపై అధికారులు ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేదు. అయితే పేపర్ల కుదింపుపై సర్కారు జీవో ఇస్తేనే బ్లూప్రింట్, మోడల్ పేపర్లు రిలీజ్ చేయాలని అధికారులు భావిస్తున్నారు. వాటి ఆధారంగానే టెన్త్  పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికైనా విద్యా శాఖ ఉన్నతాధికారులు స్పందించి, సాధ్యమైనంత త్వరగా స్పష్టత ఇవ్వాలని టీచర్లు, స్టూడెంట్లు కోరుతున్నారు.