బీ ఫాం ఇచ్చేవరకైనా పునరాలోచించాలి: మర్రి నిరంజన్రెడ్డి

బీ ఫాం ఇచ్చేవరకైనా పునరాలోచించాలి: మర్రి నిరంజన్రెడ్డి
  • నాకు టికెట్ ఎందుకియ్యలేదో కాంగ్రెస్ అధిష్టానం సమాధానం చెప్పాలి
  • బీ ఫాం ఇచ్చేవరకైనా పునరాలోచించాలి: మర్రి నిరంజన్రెడ్డి

ఇబ్రహీంపట్నం, వెలుగు: తనకు టికెట్​ఎందుకు ఇవ్వలేదో కాంగ్రెస్​పార్టీ అధిష్టానం సమాధానం చెప్పాలని ఆ పార్టీ ఇబ్రహీంపట్నం సెగ్మెంట్ నేత మర్రి నిరంజన్ రెడ్డి  డిమాండ్​ చేశారు. పార్టీ వెన్నుపోటుకు తాను బలయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మల్ రెడ్డి రంగారెడ్డిని అధిష్టానం ప్రకటించడంతో.. ఆ స్థానం నుంచి టికెట్​ రేసులో ఉన్న మర్రి నిరంజన్ రెడ్డి, దండెం రాంరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ అనుచరులతో వరుసగా భేటీ అవుతున్నారు. మంగళవారం ఇబ్రహీంపట్నంలోని సాయి ఫంక్షన్ హాల్​లో తన ముఖ్య అనుచరులు, పలువురు కాంగ్రెస్​ నేతలతో నిరంజన్ రెడ్డి సమావేశమయ్యారు.

గత 20 ఏండ్లుగా నియోజకవర్గంలో ప్రతిఒక్కరికీ అందుబాటులో ఉంటున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ తనను మోసం చేసిందన్నారు. ఇంకెన్ని రోజులు యువత గొంతు నొక్కుతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని అర్హతలతో పాటు, అధిష్టానం మొగ్గు నావైపే ఉన్నా టికెట్ మాత్రం ఇవ్వలేదన్నారు. ఎన్నో ఎలక్షన్లలో ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే కూడా నన్ను ఎంపీపీ, మున్సిపల్ చైర్మన్ కాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు.

పార్టీ పదవుల్లో కూడా తీవ్ర అవమానానికి గురయ్యానని పేర్కొన్నారు. బీఫాం ఇచ్చేవరకైనా తన విషయంపై అధిష్టానం పునరాలోచించాలని ఆయన కోరారు. మరో రెండు రోజులు అందరితో చర్చించి, భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని నిరంజన్​రెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎంఎన్​ఆర్​ యువసేన నాయకులు, కాంగ్రెస్​ పార్టీనేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.