ఏపీకి 45, తెలంగాణకు 35 టీఎంసీలు.. వాటర్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చిన కేఆర్ఎంబీ

ఏపీకి 45, తెలంగాణకు 35 టీఎంసీలు.. వాటర్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చిన కేఆర్ఎంబీ

హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి వచ్చే ఏడాది మే నెలాఖరు వరకు ఏపీ 45 టీఎంసీలు, తెలంగాణ 35 టీఎంసీలు తీసుకునేందుకు అనుమతిస్తూ కృష్ణా రివర్ మేనేజ్​మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) సోమవారం వాటర్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చింది. ఈ నెల 6న నిర్వహించిన కేఆర్ఎంబీ త్రీ మెంబర్ కమిటీ సమావేశంలో చర్చించిన అంశాల ఆధారంగా ఈ ఆర్డర్ ఇచ్చారు. ఏపీ.. నాగార్జున సాగర్ నుంచి 15 టీఎంసీలు, శ్రీశైలం నుంచి 30 టీఎంసీలు వినియోగించుకోవచ్చని తెలిపింది. తెలంగాణ 2 ప్రాజెక్టుల నుంచి 35 టీఎంసీల విని యోగానికి అనుమతిచ్చారు. 

కృష్ణా బేసిన్​లో ఈ ఏడాది జూన్ ఒకటో తేదీ నుంచి సెప్టెంబర్ నెలాఖరు దాకా ఏపీ 95.72 టీఎంసీలు, తెలంగాణ 48.54 టీఎంసీలు ఉపయోగించుకున్నట్టు గుర్తించారు. కృష్ణా బేసిన్​లో వర్షాలు లేక ప్రాజెక్టులకు సరైన ప్ర వాహాలు రాలేదు. దీంతో సాగు, తాగునీటి అవసరాలకు శ్రీశైలం నుంచి నీటిని డ్రా చేసే మట్టాన్ని 805 అడుగులు, సాగర్ ఎండీడీఎల్​ను 505 అడుగులకు తగ్గించారు. 

ఈ లెక్కన శ్రీశైలంలో 55.25, సాగర్​లో 27.53 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నాయని, ఈ 82.78 టీఎంసీల్లో 2.78 టీఎంసీలను వచ్చే ఏడాది జులై నెలాఖరు దాకా తాగునీటికి కోసం రిజర్వ్ చేశామని తెలిపారు. రెండు రిజర్వాయర్లలో ఎండీడీఎల్ మెయింటేన్ చేస్తూ నీటిని తీసుకునేందుకు రెండు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయన్నారు.