ఏపీ, తెలంగాణ ఆర్టీసీ ఎండీలు.. బస్ భవన్​లో సుదీర్ఘ చర్చలు

ఏపీ, తెలంగాణ ఆర్టీసీ ఎండీలు.. బస్ భవన్​లో సుదీర్ఘ చర్చలు

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్ర విభజన తర్వాత పేరుకుపోయిన సమస్యలను వెంటనే పరిష్కరించుకుందామని ఇరు రాష్ట్రాల ఆర్టీసీ ఎండీలు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని బస్ భవన్ లో తెలంగాణ, ఏపీ ఆర్టీసీ ఉన్నతాధికారులు సోమవారం 3 గంటల పాటు సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా పీఎఫ్​, స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీం (ఎస్ఆర్బీసీ), స్టాఫ్ రిటైర్మెంట్ బెనెవొలెంట్ స్కీం (ఎస్బీటీఎస్), రూట్స్ రేషనలైజేషన్, ఆస్తులు, అప్పులు, తిరుమలకు వెళ్లే భక్తుల సంఖ్య పెంపు వంటి ప్రధాన అంశాలపై చర్చించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏ రాష్ట్రానికి సంబంధించి.. ఆ రాష్ట్రానికి ప్రత్యేకంగా పీఎఫ్ ట్రస్టు ఏర్పాటు కావాల్సి ఉన్నా.. అది జరగలేదు. ఏపీఎస్ఆర్టీసీ పేరు మీదే ట్రస్టు కొనసాగుతున్నది. విభజన చట్టంలోని అంశాలను అమలు చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై చర్చ సాగినట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్​తో పాటు ఈడీ మునిశేఖర్, గ్రేటర్ హైదరాబాద్, ఇంజినీరింగ్, హైదరాబాద్ జోన్ ఈడీలు.. ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు సహా ఆ రాష్ట్రం నుంచి అడ్మినిస్ట్రేషన్ ఈడీ కోటేశ్వర్ రావు, ఇంజినీరింగ్ ఈడీ కృష్ణమోహన్, ఆపరేషన్ ఈడీ బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు.

ప్రత్యేక టీంల ఏర్పాటుకు ప్రతిపాదనలు

రెండు రాష్ట్రాల్లోని సమస్యల పరిష్కారానికి ముందుగా ఆయా అంశాలపై అధ్యయనం చేయాల్సి ఉంటుందని అధికారులు అభిప్రాయపడ్డారు. ఫైనాన్షియల్, ఆపరేషన్, పర్సనల్ టీంలు ఇచ్చే నివేదికల ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయని అంటున్నారు. జనవరి 2022 నాటికి పీఎఫ్ కింద రూ.1233.47 కోట్లు ఉద్యోగులకు చెల్లించాల్సి ఉండగా ఈ ఆర్నెల్లలో మరో రూ.300 కోట్లు పెరిగి మొత్తం రూ.1500 కోట్లకు పైగా బకాయిలున్నాయి. వీటికి వడ్డీలను కలిపితే అది మరింత ఎక్కువగా ఉంటుంది. అటు ఏపీలోనూ అదే పరిస్థితి. ఈ నిధుల్ని రెండు రాష్ట్రాల్లోని ఉద్యోగులకు 52:48 నిష్పత్తిలో పంచాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు అది అలాగే పెండింగ్ లో ఉంది.

రూట్​ రేషనలైజేషన్​పై చర్చ

నెల రోజుల్లో మరోసారి భేటీ కావాలని 2రాష్ట్రాల ఎండీలు అభిప్రాయపడ్డారు. రూట్స్ రేషనలైజేషన్ పైనా చర్చ జరిగింది. ఇక్కణ్నుంచి ఏపీకి, అక్కణ్నుంచి తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు నడిపే ట్రిప్పులపైనా అవగాహనకు రావాలని నిర్ణయించారు. ఎస్ఆర్బీసీ, ఎస్బీటీఎస్, సీసీఎస్ కింద చెల్లించాల్సిన నిధుల్ని ఎలా పంచాలన్నదానిపై  చర్చ సాగింది. పెరిగిన ఛార్జీలపైనా చర్చ జరిగింది. బస్సుల ద్వారా తిరుపతికి వెళ్లే వెయ్యి మందికే కల్పిస్తున్నారు. ఈ సంఖ్యను మరింత పెంచేందుకు సహకరించాలని ద్వారకా తిరుమలరావును సజ్జనార్ కోరారు. 

హైదరాబాద్ ఆస్తుల సంగతేంది?

రెండు రాష్ట్రాల్లోని ఆస్తులు, అప్పుల సంగతి అటుంచితే హైదరాబాద్ లోని బస్ భవన్, తార్నాక హాస్పిటల్​, కల్యాణ మండపం పంపకాలపైనా చర్చ సాగినట్లు సమాచారం. వేల కోట్ల విలువ గల వీటిని మిగతా ఆస్తుల్లాగా సమంగా పంచాలని ఏపీ అధికారులు కోరినట్లు తెలిసింది. ఈ ప్రస్తావనపై తెలంగాణ అధికారులు విభేదించినట్లు తెలుస్తున్నది.