బనకచర్లపై ఏపీ సీఎం చంద్రబాబు తీరు సరికాదు .. మేం వివాదాలను కోరుకోం.. హక్కులను వదులుకోం: సీఎం రేవంత్ రెడ్డి

బనకచర్లపై ఏపీ సీఎం చంద్రబాబు తీరు సరికాదు .. మేం వివాదాలను కోరుకోం.. హక్కులను వదులుకోం: సీఎం రేవంత్ రెడ్డి
  • ముందు మాకు చెప్పాల్సిందిపోయి.. కేంద్రం చుట్టూ తిరుగుడేంది?  : సీఎం రేవంత్ రెడ్డి
  • బనకచర్లపై ఏపీని చర్చలకు పిలుస్తం.. దీనిపై 23న జరిగే కేబినెట్​ భేటీలో నిర్ణయం తీస్కుంటం
  • మేం వివాదాలను కోరుకోం.. తెలంగాణ హక్కులను వదులుకోం
  • ఢిల్లీలో మీడియాతో చిట్‌‌చాట్‌‌లో సీఎం రేవంత్ రెడ్డి
  • గోదావరి జలాలను ఆంధ్రాకు రాసిచ్చిందే మామా అల్లుళ్లు కేసీఆర్, హరీశ్  
  • బనకచర్ల ప్రాజెక్టుకు కేసీఆర్ హయాంలోనే పునాది 
  • చచ్చిన పార్టీని బతికించుకునేందుకు ఇప్పుడు బీఆర్ఎస్ కుట్రలు 
  • జీబీ లింక్​ను వాడుకుంటూ సెంటిమెంట్‌‌ను రగిలించాలని చూస్తుంది
  • కిషన్‌‌ రెడ్డికి ట్యూషన్ మాస్టర్ కేసీఆర్.. కేటీఆర్‌‌‌‌కు లైజనింగ్ ఆఫీసర్ కిషన్ రెడ్డి అని విమర్శ 

న్యూఢిల్లీ, వెలుగు: జల వివాదాల పరిష్కారం కోసం గోదావరి-–బనకచర్ల (జీ-బీ) లింక్‌‌పై ఒక అడుగు ముందుకేసి ఏపీ ప్రభుత్వాన్ని తామే చర్చలకు ఆహ్వానిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పొరుగు రాష్ట్రంతో వివాదాలు కోరుకోవడం లేదని, ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీలు వద్దనేదే తమ నినాదమని చెప్పారు. కూర్చొని మాట్లాడుకుంటేనే రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కారమవుతాయని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. 

ఈ నెల 23న రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుందని, అందులో ఈ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ప్రాజెక్ట్ బై ప్రాజెక్ట్ చర్చించుకొని.. న్యాయ, సాంకేతిక పరంగా పరిష్కరించుకుందామని ఏపీ సీఎం చంద్రబాబుకు పిలుపునిచ్చారు. సంప్రదింపుల ద్వారా సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు తాము సిద్ధమేనని, అయితే ఎవరి కోసమో తెలంగాణ హక్కులను వదులుకోబోమని స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి నదుల్లో నీటి పంపకాల అంశం గత పదేండ్లుగా మరింత జటిలమైందన్నారు. ఈ విషయంలో తెలంగాణ కేటాయింపులు తేలితే... ఇతర అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. 


సమస్యల పరిష్కారంలో తమకెలాంటి భేషజాలు లేవని, ఏపీ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తమ ఆహ్వానంపై బీఆర్ఎస్ చేయబోయే విమర్శలకు భయపడేది లేదని సీఎం రేవంత్​ అన్నారు. శుక్రవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో మీడి యాతో సీఎం చిట్‌‌‌‌‌‌‌‌చాట్ చేశారు. గోదావరి–బనకచర్ల వివాదంపై మాట్లాడారు. 

ఏపీ తీరుతోనే వివాదం.. 

సముద్రంలో కలిసే గోదావరి జలాల విషయంలో వాస్తవాలు, రాజకీయాలు ముడిపడి ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘వాస్తవానికి సముద్రంలో కలిసే జలాలపై ఏపీ, తెలంగాణ కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారమయ్యేది. కానీ తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రం దగ్గరకు వెళ్లడం సరికాదు. ఇది బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌కు రాజకీయ ఆయుధంగా మారింది. ఏపీ విభజన చట్టం–2‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌014లో రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదాల కోసం ఆఫీసర్స్, టెక్నికల్, అపెక్స్ కౌనిల్స్ ఏర్పాటు చేశారు.

 అలాగే ఇరు రాష్ట్రాల మధ్య అధికారులు, మినిస్టర్స్ కమిటీ కూడా ఉంది. కానీ అధికారులు, మినిస్టర్స్ కమిటీలను కాదని.. ఏపీ సీఎం చంద్రబాబు గోదావరి-–బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ ఫీజిబిలిటి, డీపీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కేంద్రం చుట్టూ తిరగడం వల్లే అసలు వివాదం మొదలైంది. రెండు తెలుగు ప్రాంతాల మధ్య నెలకొన్న వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశలోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. కృష్ణా, గోదావరి జలాలపై కర్నాటక, మహారాష్ట్రతో మాట్లాడేందుకు ఏపీతో కలిసి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది” అని పేర్కొన్నారు. 

బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ హయాంలోనే పునాది.. 

గోదావరి జలాలను ఆంధ్రాకు రాసిచ్చిందే మామ అల్లుళ్లు (కేసీఆర్, హరీశ్ రావు) అని సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు. పోలవరం నుంచి గోదావరి వరద జలాలను ఏపీకి తరలించడానికి బీఆర్ఎస్ హయాంలోనే పునాది పడిందని మండిపడ్డారు. కేసీఆర్ అంగీకారం తెలపడం తోనే 2016, 2018లో వరద జలాలను ఏపీకి తరలించ డానికి ఆనాడు అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కార్ రెండు జీవోలను విడుదల చేసిందన్నారు. 

‘‘సముద్రంలో కలిసే 400 టీఎంసీలను పోలవరం నుంచి పెన్నా బేసిన్‌‌‌‌‌‌‌‌లోని సోమశిలకు మళ్లించడానికి అవకాశం ఉందని వ్యాప్కోస్ కన్సల్టెన్సీ సంస్థ ఏపీకి ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చింది. అయితే ఆనాడు పెన్నా బేసిన్ అని చెప్పినా, నేడు బనకచర్ల అంటున్నా రెండూ ఒకటే” అని పేర్కొన్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డితోనూ కేసీఆర్ గోదావరి జలాల వినియోగానికి చర్చలు జరిపారని.. దీనిపై ఎందుకు కోర్టులకు వెళ్లలేదని ప్రశ్నించారు. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత  గోదావరి జలాల తరలింపుపై కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో జగన్ నాలుగు సార్లు భేటీ అయ్యారన్నారు. తెలంగాణ సీఎంగా ఒకసారి ఏపీ పర్యటన చేపట్టిన కేసీఆర్.. రాయలసీమను రత్నాల సీమ చేస్తానంటూ గోదావరి జలాల మళ్లింపుకు బహిరంగంగానే అంగీకారం తెలిపారన్నారు. 

బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌వి మోసపూరిత నినాదాలు.. 

నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ మోసపూరిత నినాదాలను అడ్డంపెట్టుకొని బీఆర్ఎస్ ఇన్ని రోజులు బతి కిందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రస్తుతం చచ్చిపోయిన పార్టీని బతికించుకునేందుకు గోదావరి–-బనకచర్ల ప్రాజెక్టును వాడుకుంటోందని ఫైర్ అయ్యారు. జలాల పేరుతో మరోసారి రెండు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టి సెంటిమెంట్ రగిల్చాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పదేండ్ల పాలనలో తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ ఏం వెలగబెట్టిందో చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులకు పేరు, ఊరు, అంచనాలు మార్చడం తప్ప.. వాళ్లు చేసిందేమీ లేదని విమర్శించారు. బీఆర్ఎస్ నేతల అబద్ధాలకు దేవుడు కూడా ఆశ్చర్యపోతాడన్నారు. శివుడి తల నుంచి నేరుగా ఎర్రవల్లి ఫాంహౌస్‌‌‌‌‌‌‌‌కు గంగను దించానని, అక్కడి నుంచి నదులు పుట్టాయని కూడా కేసీఆర్ చెబుతారని విమర్శించారు. 

299 టీఎంసీలకు ఒప్పుకుందే బీఆర్ఎస్..  

కృష్ణా నది జలాల్లో 811 టీఎంసీలకు గాను.. తెలంగాణకు కేవలం 299 టీఎంసీలకు ఒప్పుకుంటూ సంతకం చేసింది మాజీ మంత్రి హరీశ్​రావు కాదా? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ‘‘2020 జనవరిలో జరిగిన కేఆర్ఎంబీ 1 వ మీటింగ్‌‌‌‌‌‌‌‌లో తెలంగాణకు 299 టీఎంసీలు చాలంటూ ఒప్పుకున్నారు. అలాగే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి నేతృత్వంలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌‌‌‌‌‌‌‌లోనూ కేసీఆర్, హరీశ్​ఈ కేటాయింపులకే కట్టుబడి తెలంగాణకు అన్యాయం చేశారు. 

చేసిన తప్పంతా చేసి 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మేల్కొన్న హరీశ్​రావు.. 299 టీఎంసీల ఒప్పందంతో తెలంగాణ కు అన్యాయం జరుగుతోందని ఆనాటి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌‌‌‌‌‌‌‌కు లేఖ రాశారు. 2015లో జరిగిన ఒప్పందం తెలంగాణకు ఉరి లాంటిదని, అందువల్ల 811 టీఎంసీల్లో 50:50 నిష్పత్తిలో కేటాయింపులు చేయాలని అందులో పేర్కొన్నారు. 

కానీ మేం కృష్ణా నదిలో 500 టీఎంసీలు బ్లాంకెట్‌‌‌‌‌‌‌‌గా ఇవ్వాలని కోరుతుంటే.. హరీశ్​రావు ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు. ఆయన లెక్క ప్రకారం... 50:50 నిష్పత్తిలో పంపకాలు చేసినా తెలంగాణకు వచ్చేది దాదాపు 405 టీఎంసీలే. అంటే హరీశ్ రావు కన్నా మేం మరో 100 టీఎంసీలు ఎక్కువగా డిమాండ్ చేస్తున్నాం’’ అని వివరించారు. ఇప్పుడు హరీశ్​ రావు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారని నిలదీశారు. మామ అపర భగీరథుడు అయితే అల్లుడు అపర మేధావి అనుకుంటారని ఎద్దేవా చేశారు. పొడవు పెరిగినంత మాత్రాన తెలివి రాదని చురకలంటించారు. 

బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ను కాపాడుతున్నది బీజేపీనే.. 

కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ట్యూషన్ మాస్టర్ కేసీఆర్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అలాగే కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు లైజనింగ్ ఆఫీసర్ కిషన్ రెడ్డి అంటూ విమర్శలు గుప్పించారు. ‘‘2024 లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అవయవదానం చేసి బీజేపిని గెలిపించింది. అందుకు బదులుగా బీఆర్ఎస్ పార్టీని కాపాడేందుకు కిషన్ రెడ్డి పని చేస్తున్నారు. కేంద్ర మంత్రులు సీఆర్ పాటిల్, మనోహర్ లాల్ ఖట్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో నా అపాయింట్మెంట్ ఉన్న విషయం తెలుసుకొని.. నాకన్నా ముందు కిషన్ రెడ్డి ఆ ఇద్దరు మంత్రులను కలిశారు. ఈ సందర్భంగా లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అవయవదానం గురించి చెప్పి, కాపాడే ప్రయత్నం చేశారు. బనకచర్లపై మీటింగ్ అంటే.. నేను హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఉంటే ఢిల్లీకి, ఢిల్లీలో ఉంటే హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు కిషన్ రెడ్డి పరుగులు పెడుతున్నారు” అని ఎద్దేవా చేశారు. 

రాష్ట్ర ప్రభుత్వం చేసిన కుల సర్వేలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్​ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, పల్లా, ఇతర రాజకీయ నాయకులు పాల్గొనలేదని చెప్పారు. అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కవిత మాత్రం పాల్గొన్నారని తెలిపారు. తమ అక్రమ ఆస్తులు బయటపడతాయనే భయంతోనే కేసీఆర్, కేటీఆర్, హరీశ్​ఈ సర్వేకు దూరంగా ఉన్నారని అన్నారు. కాళేశ్వరం డిజైన్లకు కేబినెట్ ఆమోదం ఉన్నదని ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఏటీఎంలా మారిందని ప్రధాని మోదీ, అమిత్ షా విమర్శిస్తే.. ఆ పార్టీ ఎంపీ ఈటల వ్యాఖ్యలు ఎవరికి మేలు చేసేలా ఉన్నాయో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. 

జులైలో మళ్లీ ఢిల్లీకి.. 

జులై 6, 7 తేదీల్లో మరోసారి ఢిల్లీ పర్యటనకు రానున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రెండ్రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకున్న ఆయన.. శుక్రవారం తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.

అందుకే ఇదంతా చేస్తున్నరు.. 

2029 ఎన్నికల్లో మళ్లీ గెలిచేందుకు ప్రధాని మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అవసరం ఉంది. అలాగే చంద్రబాబు నాయుడుకు గోదావరి వరద జలాల అవసరం ఉంది. తెలంగాణలో పార్టీని బతికించుకోవడానికి బీఆర్ఎస్‌‌కు పోలవరం-బనకచర్ల అవసరం ఉంది. అందుకే వీరంతా కలిసి కాంగ్రెస్‌‌ను, నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు.  - సీఎం రేవంత్ రెడ్డి 

అప్పుడే మిగులు జలాల లెక్క తేలేది...

తెలంగాణలో చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తయితేనే మిగులు జలాల లెక్క తేలుతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు అర్థం చేసుకోవాలని సూచించారు. ‘‘గోదావరిలో తెలంగాణకు 968 టీఎంసీలు, ఏపీకి 518 టీఎంసీలు దక్కాయి. కానీ పదేండ్లుగా తెలంగాణలో చేపట్టిన ప్రతి ప్రాజెక్టుకు ఏపీ అడ్డంకులు సృష్టిస్తోంది. దీంతో వివిధ దశల్లో ప్రాజెక్టులు వాయిదా పడుతూ వస్తున్నాయి. 

ఏపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులకు అప్రైజల్ కమిటీ, ఎన్విరాన్మెంట్, సీడబ్ల్యూసీ అనుమతులపై కేంద్రం స్పీడ్‌‌‌‌‌‌‌‌గా స్పందిస్తోంది. బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై ఏపీ డీపీఆర్ సమర్పించకపోయినా.. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఈ ప్రాజెక్టుపై చర్చించారు. కానీ18 నెలలుగా నేను, రాష్ట్ర మంత్రులు.. కేంద్రమంత్రులను కలిసి విజ్ఞప్తి చేసినా తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడం లేదు. 

ఏపీలో పోలవరం, తెలంగాణలో ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులు రాష్ట్ర విభజనకు ముందు చేపట్టిన ప్రాజెక్టులే. కానీ ఈ ప్రాజెక్టుల్లో ఏ చిన్న మార్పు చేసినా విభజన చట్టం–2014 ప్రకారం మరో రాష్ట్రానికి తెలియజేయాల్సి ఉంటుంది. ఈ నిబంధన ప్రకారం... పోలవరం నుంచి బనకచర్లకు నీటిని తరలించే జీబీ ప్రతిపాదనను ముందుగా మా దృష్టికి తేవాల్సింది” అని అన్నారు.

కాళేశ్వరానికి 96 వేల కోట్లు చెల్లించాం..

కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇప్పటి వరకు రూ.1.27, 872 కోట్ల టెండర్లు పిలవగా.. రూ.95,902 కోట్లు చెల్లించామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇంకా రూ.50 వేల కోట్ల పనులు కావాల్సి ఉందన్నారు. అలాగే అన్ని కాంపోనెంట్స్ పూర్తి కావాలంటే ప్రాజెక్ట్ వ్యయం రూ.2 లక్షల కోట్లకు చేరుతుందని తెలిపారు. రూ.80 వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతిఎలా సాధ్యమని బీఆర్ఎస్ నేతలు తిరిగి ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు.ఈ ప్రాజెక్టుతో కేవలం ఒకే సీజన్‌‌‌‌‌‌‌‌కు 50 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు అందిందని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలో రికార్డ్ స్థాయిలో పండిన వరికి ఈ ప్రాజెక్టుతో అణువంత కూడా సంబంధం లేదన్నారు.