
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ జులై 4వ తేదీన ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జగన్ అక్కడ 2 రోజుల పాటు వివిధ కార్యకలాపాలను చూసుకుని తిరిగి రాష్ట్రానికి చేరుకుంటారని సమాచారం. కాగా జులై 4 సాయంత్రం ఢిల్లీ కి చేరుకొని పక్క రోజు జులై 5న ప్రధాని మోడీతో సమావేశం కానున్నారు. ఇక ఆ తర్వాత కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా తో పాటుగా పలువురు కేంద్రమంత్రులను కలుసుకుని రాష్ట్రానికి సంబంధించి కొన్ని విషయాలను గురించి అడగనున్నారు. ఇక ఎప్పటిలాగే ఈసారి కూడా రాష్ట్ర విభజనలో భాగంగా ప్రత్యేకంగా రావాల్సిన అన్ని నిధులను, ప్రత్యేక హోదాను మరియు పెండింగ్ లో ఉన్న కొన్ని నిధులను గురించి చర్చించనున్నారు.
మరో ఏడాదిలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. మూడోసారి దేశంలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా ఎన్డీయేయేతర పార్టీలు కూటమిగా ఏర్పడుతున్న సమయంలో ఎన్డీయేను విస్తరించేందుకు బీజేపీ అధిష్టానం దృష్టిపెట్టింది. ఈ క్రమంలోనే ఇటీవల చంద్రబాబుతో జేపీ నడ్డా, అమిత్ షాలు భేటీ అయ్యారు. దీంతో ఏపీలో టీడీపీతో బీజేపీ పొత్తు ఖాయమైనట్లు ప్రచారం జరుగుతుంది. ఇదే సమయంలో సీఎం జగన్ సైతం బీజేపీ మనకు దూరమైనట్లేనని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం జగన్ ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్‌షాలను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లనుండటం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఎన్డీయే విస్తరణలో భాగంగా ఏపీలో టీడీపీతో కాకుండా వైసీపీతో కలిసి వెళ్లేందుకు బీజేపీ అధిష్టానం సిద్ధమైందా అనే వాదన తెరపైకి వచ్చింది. మరోవైపు జూలై 20 పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో పలు బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈ సమయంలో వైసీపీ మద్దతు తీసుకొనేందుకు జగన్‌తో మోడీ, అమిత్ షా చర్చిస్తారన్న చర్చకూడా జరుగుతుంది. అలాకాకుండా, రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై సాధారణ భేటీలో భాగంగా ప్రధాని మోడీ, అమిత్ షాతో జగన్ భేటీ అవుతున్నారని పలువురు బీజేపీ నేతలు చెబుతున్నారు. మొత్తానికి ఎన్డీయే విస్తరణకు బీజేపీ అధిష్టానం దృష్టిసారించిన నేపథ్యంలో వై.ఎస్. జగన్ ప్రధాని మోడీ, అమిత్ షాలతో భేటీ కానుండటం ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.