హాస్టళ్లు, హాస్పిటళ్లలో రాత్రిళ్లు పడుకోండి : కలెక్టర్లకు జగన్ కీలక ఆదేశాలు

హాస్టళ్లు, హాస్పిటళ్లలో రాత్రిళ్లు పడుకోండి : కలెక్టర్లకు జగన్ కీలక ఆదేశాలు

కలెక్టర్ కనిపిస్తే కోల్గేట్ యాడ్ గుర్తురావాలి

కలెక్టర్లు నవ్వుతూనే మాట్లాడాలి

వారానికోరోజు హాస్టళ్లు, స్కూళ్లు, PHCల్లో రాత్రిళ్లు పడుకోండి

ప్రతి సోమవారం నో రివ్యూస్.. ఓన్లీ గ్రీవెన్స్ సెల్ మీటింగ్స్

‘స్పందన’ పేరుతో బ్రాండింగ్ చేయండి

సోమవారం ప్రజాసమస్యలు పరిష్కరించడమే పని

ఆటోమేటిగ్గా మార్పు వస్తుంది

రెండేళ్ల తర్వాత ఫొటోలతో ప్రూఫ్ లు, మార్పు చూపించాలి

చదువు, ఆరోగ్యం.. ఇవి రెండింటికి ప్రథమ ప్రాధాన్యం

కలెక్టర్లకు సీఎం జగన్ టైమ్ లైన్.. కీలక ఆదేశాలు

అమరావతి : ప్రజావేదికలో కలెక్టర్లకు కీలక ఆదేశాలు ఇచ్చారు సీఎం జగన్మోహన్ రెడ్డి. రెండేళ్లలో మార్పు చూపించాలని డెడ్ లైన్ పెట్టారు. సన్నిహితంగా ఉండే ఐఏఎస్ లతో మాట్లాడి కొన్ని సలహాలు తీసుకున్నాననీ.. వాటిని కలెక్టర్లకు వివరించారు జగన్. “నేను చనిపోతే.. జనం ఇళ్లలో నా ఫొటో ఉండాలనుకుంటాను. అలాగే ప్రతి కలెక్టర్ కూడా.. జనంతో తాను బాగా పనిచేసేవాడు అనిపించుకోవాలి. ట్రాన్స్ పరెంట్.. ఫ్రెండ్లీ గవర్నమెంట్.. ఇవే సూత్రాలుగా పనిచేయాలి” అని సూచించారు.

కలెక్టర్ పొద్దున నుంచి సాయంత్రం వరకు నవ్వుతూ ఉండాలని సూచించారు జగన్. ఎందుకొచ్చామని జనం అనుకోవడం కాకుండా ఆప్యాయంగా పలకరిస్తాడబ్బా.. అనే పేరు తెచ్చుకోవాలన్నారు. “నవరత్నాలు.. మన మేనిఫెస్టో.. ప్రతి అర్హత ఉన్న ప్రతి ఇంటికి వెళ్లాలి. మనపార్టీ.. ఇంకోపార్టీ .. సంబంధం లేదు. అర్హులైన అందరికీ అది అందాలి. కలెక్టర్లదే దీని బాధ్యత” అన్నారు.

“ప్రతి సోమవారం ‘స్పందన’ పేరుతో గ్రీవెన్ సెల్ పెట్టండి. ఈ ప్రోగ్రామ్ ను బ్రాండింగ్ చేయండి. ఫుల్లు పబ్లిసిటీ ఇవ్వండి. ఎవ్రీ మండే.. గ్రామస్థాయి నుంచి.. రాజధాని వరకు.. ప్రతి ఆఫీస్ లో గ్రీవెన్ సెల్ ఉండాలి. మండే రోజు ఎవ్వరినీ పిలవకండి.. నో రివ్యూ మీటింగ్స్. అందరూ కూడా గ్రీవెన్స్ సెల్ నిర్వహించండి. జనం ఫిర్యాదులతో వచ్చినప్పుడు అధికారులు నవ్వుతూ స్పందించాలి. టూత్ పేస్ట్ కోల్గేట్ యాడ్ కనిపించాలి. నాకు మీ పళ్లే కనిపించాలి. గ్రీవెన్స్, మొబైల్ నంబర్ తీసుకున్న తర్వాత…. వాళ్లకు రిసీప్ట్ ఇవ్వండి. పరిష్కారానికి ఓ టైమ్ లైన్ చెప్పండి. త్వరలోనే రచ్చబండ కార్యక్రమం మొదలుపెడతా.. ఆ రిసీప్ట్ లను నేను ర్యాండమ్ గా చెక్ చేస్తా. మీ లెవెల్ లో మీరు కూడా కనీసం నెలకు 10 రిసీప్టులు చెక్ చేయండి” అని సూచించారు సీఎం జగన్.

అక్కడ వారానికో రాత్రి పడుకోండి

“కలెక్టర్లు.. వారానికి ఒక్కరోజు రాత్రి హాస్టల్స్, PHCల్లో పడుకోవాలి. అక్కడే నిద్రించినప్పుడు.. పరిస్థితులు మారుతాయి. అక్కడే స్నానం చేయండి. అప్పుడే బాత్రూమ్స్ బాగవుతాయి. ఎక్కడికైనా సడెన్ గా వెళ్లాలి. ముందుగా చెప్పకూడదు. అప్పుడే బాధ్యత తెలుస్తుంది. ఆ భయం ఉంటే.. అన్నీ బాగుంటాయి. హాస్టల్స్, స్కూల్స్ లో తనిఖీల తర్వాత ఫొటో తీసుకోండి. ఆ ఫొటోలతో 2 ఏళ్లలో వచ్చిన మార్పు ఇదీ అని చూపించాలి. చదువు, ఆరోగ్యం వీటికే నా ప్రాధాన్యత. ఎంత కావాలంటే అంత ఫండ్ నేనిస్తా.” అని జగన్ కలెక్టర్లకు సూచించారు.

MLAలకు కలెక్టర్లు సహకరించాలి

నవరత్నాలను అర్హులైన ప్రతి ఒక్కరికి చేర్చడం తమ లక్ష్యమన్నారు సీఎం జగన్. ఎంతో నమ్మకంతో తమ పార్టీ ఎమ్మెల్యేలను భారీస్థాయిలో ప్రజలు గెలిపించారనీ… వారికి కలెక్టర్లు సహకరించాలని జగన్ కోరారు. ఎమ్మెల్యేలు ఏ సమస్యతో వచ్చినా.. దానిని వెంటనే పరిష్కరించేందుకు చొరవ చూపాలన్నారు.