కృష్ణా జలాల అంశంపై..ఏపీ సీఎం జగన్ అభ్యంతరం

కృష్ణా జలాల అంశంపై..ఏపీ సీఎం జగన్ అభ్యంతరం
  • కేబినెట్ నిర్ణయంపై ముందుకెళ్లొద్దని కేంద్ర మంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి

న్యూఢిల్లీ, వెలుగు : కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–II) విధివిధానాలకు సంబంధించి ఇటీవల కేంద్ర కేబినెట్ తీసుకొన్న నిర్ణయంతో తమ రాష్ట్రానికి నష్టం జరుగుతుందని ఏపీ సీఎం జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విధివిధానాలను బేసిన్‌‌లోని కర్నాటక, మహారాష్ట్రలకు కాకుండా కేవలం ఏపీ, తెలంగాణకు పరిమితం చేయడం అశాస్త్రీయమని చెప్పారు. ఏపీ ప్రజల ఆందోళనలను పరిగణనలోకి తీసుకొని, తదుపరి చర్యలు తీసుకోకుండా సంబంధిత వ్యక్తులను ఆదేశించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఢిల్లీ పర్యటనలో ఉన్న జగన్ శుక్రవారం రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ సందర్భంగా ఈ విషయాన్ని ప్రస్తావించారు. కేడబ్ల్యూడీటీ –-II నిర్ణయాన్ని సవాల్‌‌చేస్తూ సుప్రీంకోర్టులో 5 స్పెషల్ లీవ్ పిటిషన్లు ఇప్పటికే పెండింగ్‌‌లో ఉన్నాయని అమిత్ షాకు తెలియజేశారు. పోలవరం ప్రాజెక్టు నిధుల విడుదలపై చర్చించారు. ఈ ప్రాజెక్ట్ తాజా అంచనాలకు ఆమోదం తెలపాల్సి ఉందని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.