తెలంగాణలో ఏపీ ప్రజలున్నారని ఊరుకుంటున్న

తెలంగాణలో ఏపీ ప్రజలున్నారని ఊరుకుంటున్న
  • జల వివాదంపై ఏపీ సీఎం జగన్ కామెంట్స్

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మధ్య జల వివాదాలపై కేబినెట్ మీటింగ్‌లో ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా తెలంగాణ సర్కారును హెచ్చరిస్తున్నట్టుగా కామెంట్స్ చేశారు. తెలంగాణలో ఏపీ ప్రజలు ఉన్నారనే ఎక్కువగా మాట్లాడకుండా ఊరుకుంటున్నామని, ఆంధ్రా ప్రజలను తెలంగాణలో ఇబ్బంది పెడతారనే ఆలోచిస్తున్నట్టు మంత్రులతో వైఎస్ జగన్ పేర్కొన్నారు. నీటి అంశంలో ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచించాలని మంత్రులకు సీఎం జగన్‌ సూచించారు. రైతులకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకోవాలని ఆయన ప్రశ్నించారు. ఏపీ హక్కుగా వచ్చే ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోబోమని స్పష్టం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి విషయంపై మరోసారి కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కి లేఖ రాయాలని అధికారులను ఆదేశించారు. అనుమతి లేకుండాకరెంట్ ఉత్పత్తి కోసం నీటిని వాడుకోవడంపై చర్యలు తీసుకోవాలని లేఖలో ప్రస్తావించాలని కోరాలన్నారు. కాగా, కృష్ణా నదిపై ఏపీ అక్రమంగా కడుతున్న సంగమేశ్వరం ఎత్తిపోతలపై తెలంగాణ మంత్రులు ఇటీవల సీరియస్ కామెంట్లు చేయడంతో జగన్ ఈ రకంగా స్పందించారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కడుతున్న ప్రాజెక్టులపైనా ఏపీ సర్కారు కృష్ణా బోర్డుకు ఫిర్యాదులు చేస్తోంది. దీంతో రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం తీవ్ర స్థాయిలో నడుస్తోంది. అయితే ఏపీ చేపడుతున్న సంగమేశ్వరం ఎత్తిపోతలపై తాము ఎప్పటి నుంచో చెబుతున్నా స్పందించని టీఆర్ఎస్ సర్కారు ఇప్పుడు హుజూరాబాద్ ఎలక్షన్లలో తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి ఓట్లు రాబట్టుకునేందుకే మంత్రులంతా సీరియస్‌గా మాట్లాడుతున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.