ఏపీలో జగన్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్తుందా..?

ఏపీలో జగన్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్తుందా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ప్రస్తుతం ఆ రాష్ర్టంలో ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. ఇప్పటి నుంచే అన్ని పార్టీలు ఎన్నికల వ్యూహాలతో దూకుడుగా ముందుకు వెళ్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ వర్సెస్ వైసీపీ, జనసేన వర్సెస్ వైసీపీ తరహా రాజకీయాలు నడుస్తున్నాయి. ఒక పార్టీపై మరో పార్టీ సవాళ్లు.. ప్రతి సవాళ్లు విసురుకుంటున్నాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే ఏపీ సీఎం వైఎస్ జగన్.. అసెంబ్లీని రద్దు చేసి, ముందస్తు ఎలక్షన్స్ కు వెళ్లే అవకాశాలు ఉన్నాయని పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగే షెడ్యూల్‌కు ఆరు నెలల ముందే అసెంబ్లీని రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ర్టంలో ప్రజావ్యతిరేక ఏదైనా ఉంటే.. దాన్ని తొలగించి.. ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తూ.. పార్టీని మరింతగా ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లాలని సీఎం వైఎస్ జగన్ భావిస్తున్నారు. ఇటీవలి ఢిల్లీ పర్యటనలో బీజేపీ అగ్రనాయకత్వంతో వైఎస్ జగన్ జరిపిన చర్చల్లో ఈ విషయం స్పష్టమైందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.

ప్రస్తుతం కేంద్రం ప్రభుత్వంతో (ఎన్‌డిఎ ప్రభుత్వం) వైఎస్ జగన్ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగానే గత తెలుగుదేశం ప్రభుత్వ హయంలో పెండింగ్ లో ఉన్న రెవెన్యూ లోటును పూడ్చుకునేందుకు కేంద్రం ఇటీవల వైసీపీ విజ్ఞప్తులకు రూ. 10 వేల కోట్లకు పైగా నిధులను విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ర్టంలోని సంక్షోభాన్ని మరో ఆరు నెలల పాటు వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఎదుర్కోవటానికి ఈ నిధులు సహాయపడతాయని వైసీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ర్ట ప్రభుత్వంపై ప్రజల్లో మంచి నమ్మకం, భరోసా ఉన్నప్పుడే ఎన్నికలకు వెళ్తే బాగుంటుందని వైఎస్ జగన్ భావిస్తున్నారని సమాచారం. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ(వైసీపీ)ని గద్దె దించేందుకు బీజేపీ, -జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే.. ఇది ఎంత వరకూ సక్సెస్ అవుతుందన్నది మాత్రం త్వరలోనే తేలనుంది. 

మరోవైపు ఇటీవల జరిగిన మహానాడుకు పెద్దగా రెస్సాన్స్ రాలేదని చెబుతున్నారు. ఇప్పటికి ఇప్పుడు ఎలక్షన్స్ జరిగితే టీడీపీ గట్టెక్కడం కష్టమే అంటున్నారు. రెండు నెలల క్రితం ఏపీలో శాసన మండలికి జరిగిన గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. కానీ.. అంతకుముందు రాష్ట్రంలో జరిగిన జిల్లా పరిషత్‌లు, స్థానిక సంస్థల ఎన్నికలు, ఉప ఎన్నికల్లోనూ టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. దాదాపు అన్ని ఎన్నికల్లోనూ ఓడిపోతూ వచ్చింది. ఇదే ఇప్పుడు వైసీపీకి కలిసి వచ్చే అవకాశం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పార్టీ బలంగా ఉన్నప్పుడే.. ప్రజల్లో ప్రభుత్వంపై మంచి పేరు, నమ్మకం ఉన్నప్పుడే ఎలక్షన్స్ కు వెళ్లాలని సీఎం వైఎస్ జగన్ కూడా ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది.