ప్రధాని మోడీతో సమావేశమైన ఏపీ సీఎం జగన్

 ప్రధాని మోడీతో సమావేశమైన ఏపీ సీఎం జగన్

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయ్యారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా నిన్న రాత్రి ఢిల్లీకి వచ్చిన జగన్ కొద్దిసేపటి క్రితం ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులతోపాటు, పెండింగ్ బకాయిలు, పోలవరం సహా పలు ప్రాజెక్టుల గురించి చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర విభజన హామీల గురించి, అలాగే మూడు రాజధానుల అంశాన్ని ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

సీఎం జగన్ తోపాటు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్ సభాపక్ష నేత వైఎస్ అవినాశ్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉన్నారు. ప్రధానితో భేటీ ముగిశాక మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తోనూ జగన్ భేటీ కానున్నట్లు సమాచారం. అలాగే రాత్రి 10గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోనూ సీఎం జగన్ సమావేశం అయ్యేందుకు అపాయింట్మెంట్ తీసుకున్నట్లు సమాచారం.