శ్రీశైలం కరెంట్​పై మళ్లీ లొల్లి

శ్రీశైలం కరెంట్​పై మళ్లీ లొల్లి
  • కృష్ణా బోర్డుకు ఏపీ కంప్లైంట్
  • రాయలసీమలో ప్రజా ఉద్యమాలకు తెర
  • తెలంగాణను దోషిగా చూపే ప్రయత్నాలు చేస్తున్న ఏపీ

హైదరాబాద్, వెలుగు : శ్రీశైలంలో తెలంగాణ పవర్​ జనరేషన్​పై మళ్లీ లొల్లి షురూ అయింది. నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ కరెంటు ఉత్పత్తి చేస్తున్నదని ఏపీ గగ్గోలు పెడుతున్నది. దీనిపై కంప్లైంట్లతో సరిపెట్టకుండా రాయలసీమలో ప్రజా ఉద్యమాలు, ఆందోళనలకు తెరతీసింది. రెండేళ్లుగా తెలంగాణ కరెంటు​ఉత్పత్తిపై వరుస ఫిర్యాదులు చేస్తూ వస్తున్న ఏపీ.. ఇప్పుడు మళ్లీ అదే తరహాలో కృష్ణా బోర్డుకు కంప్లైంట్​ చేసింది. శ్రీశైలం లెఫ్ట్​ బ్యాంక్​ పవర్​ స్టేషన్​(టీఎస్​జెన్కో) లో కరెంట్​ ఉత్పత్తి వెంటనే నిలిపి వేయించాలని ఏపీ ఇరిగేషన్​ఈఎన్సీ నారాయణ రెడ్డి గురువారం కేఆర్ఎంబీ చైర్మన్​శివ్​నందన్​కుమార్​కు లేఖ రాశారు. 

చెన్నై తాగునీటితో పాటు ఎస్సార్​బీసీ, గాలేరు–నగరి, హంద్రీనీవా ప్రాజెక్టులకు నీళ్లు రాకుండా చేయాలని తెలంగాణ కరెంటు​ఉత్పత్తి చేస్తోందని ఆయన ఆరోపించారు. వెంటనే కరెంట్​ఉత్పత్తిని నిలిపి వేయించాలని, ఈ మేరకు తెలంగాణకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ లేఖపై బోర్డు మెంబర్లు, ఉన్నతాధికారులతో చైర్మన్​ సమీక్షించారు. ఆ లేఖపై తగిన చర్యలు చేపట్టాలని మెంబర్​ అజయ్​ కుమార్​ గుప్తాకు సూచించారు. తెలంగాణ కరెంట్​ఉత్పత్తిపై ఏసీ చేసిన కంప్లైంట్​పై కృష్ణా బోర్డులోని రెండు రాష్ట్రాలకు చెందిన ఇంజినీర్లు వేర్వేరు నివేదికలు ఇచ్చినట్లు తెలిసింది. పోతిరెడ్డిపాడు ఆధారిత ప్రాజెక్టులకు నీళ్లిచ్చేలా కరెంట్​ ఉత్పత్తి నిలిపివేయాలని ఏపీ ఇంజనీర్లు సూచిస్తే, దానికి భిన్నంగా తెలంగాణ ఇంజనీర్లు నివేదించినట్లు సమాచారం. 

తెలంగాణపై ఏపీ అడ్డగోలు వాదన

2021 – 22, 2022 – 23 వాటర్​ఇయర్​లలో తెలంగాణ కరెంట్​ఉత్పత్తిపై కృష్ణా బోర్డుకు పదుల సంఖ్యలో ఏపీ కంప్లైంట్లు చేసింది. తెలంగాణలోని ఎత్తిపోతల పథకాల కోసం హైడల్​ పవర్​ ఉత్పత్తి చేయాలని ఆదేశిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీఓను ఏపీ సుప్రీంకోర్టులో సవాలు​చేసింది. ఈ పిటిషన్ పై ఇంకా విచారణ కొనసాగుతున్నది.తెలంగాణ జెన్కో కరెంట్​ఉత్పత్తి చేస్తూ ఇప్పటి వరకు నాగార్జునసాగర్​కు 4 టీఎంసీల నీటిని విడుదల చేసింది. సాగర్​కు విడుదల చేసిన నీటిని తెలంగాణతో పాటు ఏపీ కూడా వినియోగించుకుంటుంది. ఈ వాస్తవాన్ని చెప్పకుండా తెలంగాణ కరెంట్​ ఉత్పత్తి ద్వారా నీటిని వృథా చేస్తోందని ఏపీ అడ్డగోలుగా వాదిస్తోంది. ఈ మొత్తం ఎపిసోడ్​లో తెలంగాణను దోషిగా చూపించే ప్రయత్నాలు చేస్తున్నారనే తప్ప అసలు నిజాలేంటో చెప్పడానికి మాత్రం ఇష్టపడటం లేదు.