
తెలుగు చిత్ర పరిశ్రమ తీరుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్ కోసం ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నప్పటికీ, సినీ పరిశ్రమ సానుకూలంగా స్పందించడం లేదని, కనీస కృతజ్ఞత చూపించడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం సినీ రంగం కోసం అనేక చర్యలు చేపడుతున్నప్పటికీ, థియేటర్ల బంద్ వంటి నిర్ణయాలు పరిశ్రమ, ప్రభుత్వం మధ్య గ్యాప్‌ను పెంచుతున్నాయని చెబుతూ ఓ నోట్ విడుదల చేశారు. ‘‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీని అభివృద్ధి చేయాలని చూస్తుంటే.. సినీ రంగంలో ఉన్నవారు మాత్రం ఏపీ ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత చూపించడం లేదు.
ఎన్.డి.ఏ. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారిని తెలుగు సినిమా సంఘాలు కనీసం ఒకసారి కూడా కలవలేదు. కేవలం తమ చిత్రాల విడుదల సందర్భంలో వ్యక్తిగతంగా కలవడం తప్ప, సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి కోసం కలిసి రావడం లేదు. గత వైసీపీ ప్రభుత్వంలో సినీ పెద్దలు, అగ్రనటులు, సాంకేతిక నిపుణులు ఎదుర్కొన్న ఇబ్బందులను తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలి, మూవీ ఆరిస్ట్స్ అసోసియేషన్ లాంటి సంఘాలు మరచిపోయినట్లున్నాయి. అయినప్పటికీ ఎవరికి వారు వ్యక్తిగతంగా వచ్చి తమ సినిమాలకు టికెట్ ధరలు పెంచమని సినిమాటోగ్రఫీ శాఖకి అర్జీలు ఇస్తూ వచ్చారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూనే ఉంది’ అని అన్నారు.
రిటర్న్ గిఫ్ట్‌కు థ్యాంక్స్
సినిమా రంగానికి పరిశ్రమ హోదా ఇచ్చేందుకు తాను ఆలోచిస్తుంటే.. తెలుగు సినిమాకి చెందిన కొందరు తనకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారని, దానిని తగిన విధంగానే స్వీకరిస్తానంటూ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞాపనలు, చర్చలకు తావులేదని, సంబంధిత విభాగం ప్రతినిధులతోనే చర్చిస్తానని, ఆ విజ్ఞాపనలను సంబంధిత విభాగాలకు పంపిస్తానని ఆయన చెప్పారు. ఆయన హీరోగా నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా రిలీజ్ అవుతున్న సమయంలో ఎగ్జిబిటర్లు థియేటర్ల బంద్ చేయాలని నిర్ణయించడం ఆయనను తీవ్ర అసంతృప్తికి గురిచేసినట్టు తెలుస్తోంది. దీనిని పవన్ కల్యాణ్ ‘రిటర్న్ గిఫ్ట్’గా అభివర్ణించారు.
ఆదాయంపై ఆరా
ఇక రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధి కోసం ప్రత్యేక పాలసీని తీసుకొస్తున్నామని చెప్పిన పవన్ కళ్యాణ్.. థియేటర్స్ ఆదాయం, లీజుదారుల చేతిలో ఎక్కువ థియేటర్స్ ఉండటం, సక్రమంగా పన్నుల వసూలు, టికెట్ ధరల పెంపుతో ఆదాయం పెరిగిందా లాంటి విషయాలపై సంబంధిత శాఖలతో చర్చిస్తామని ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో ఓ నోట్‌ను విడుదల చేశారు.