Pawan Kalyan Son: AI దుర్వినియోగంపై కేసు.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్..

Pawan Kalyan Son: AI దుర్వినియోగంపై కేసు.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్..

ఇటీవలి కాలంలో ఏఐ (AI) టెక్నాలజీ విస్తృతంగా అందుబాటులోకి రావడంతో, చాలామందికి ఇది ప్రయోజనకరంగా మారినప్పటికీ, మరికొందరికి మాత్రం తీవ్రమైన ఇబ్బందులకు కారణమవుతోంది. ముఖ్యంగా సెలబ్రిటీలు ఈ AI టెక్నాలజీ వల్ల ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు.

ఈ క్రమంలోనే లేటెస్ట్గా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ (Akira Nandan) ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సోషల్ మీడియాలో తన పేరుతో, తన ఫేస్ని ఉపయోగిస్తూ ప్రచారం అవుతున్న AI జనరేటెడ్ కంటెంట్ నుంచి తన వ్యక్తిత్వ హక్కులను కాపాడాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు.

ఇటీవలి కాలంలో సోషల్ మీడియా వేదికగా అకీరా నందన్‌కు సంబంధించినట్లు చూపిస్తూ అనుమతి లేకుండా తయారు చేసిన ఫొటోలు, వీడియోలు, ఇతర డిజిటల్ కంటెంట్ విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ఇవి తన గోప్యతకు భంగం కలిగించడమే కాకుండా, వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘనగా మారుతున్నాయని పిటిషన్‌లో అకీరా వెల్లడించారు. 

►ALSO READ | జగన్ కు లిక్కర్ స్కాం గురించి తెలిసి ఉండదు: విజయసాయి రెడ్డి

ప్రత్యేకించి AI టెక్నాలజీని ఉపయోగించి తన రూపం, పేరుతో రూపొందిస్తున్న కంటెంట్‌ను వెంటనే తొలగించాలని, భవిష్యత్తులో ఇలాంటి కంటెంట్ ప్రచారాన్ని నిలిపివేయాలని కోర్టును అకీరా నందన్ కోరారు. అలాగే సోషల్ మీడియా ప్లాట్‌ఫార్ములు, డిజిటల్ కంటెంట్ క్రియేటర్లపై తగిన నియంత్రణ చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో  అకీరా వెల్లడించారు.

ప్రముఖ వ్యక్తుల కుటుంబ సభ్యుల గోప్యత, వ్యక్తిత్వ హక్కులపై AI జనరేటెడ్ కంటెంట్ పెరుగుతున్న నేపథ్యంలో, అకీరా నందన్ దాఖలు చేసిన ఈ పిటిషన్ చట్టపరంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కేసుపై ఢిల్లీ హైకోర్టు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో ఇలాంటి వ్యవహారాలకు మార్గదర్శకంగా నిలిచే అవకాశం ఉందని న్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఇదిలా ఉండగా.. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి సెలబ్రిటీల అనుమతి లేకుండానే వారి ఫోటోలు, వీడియోలు, వాయిస్‌ను వినియోగిస్తూ కొందరు వ్యక్తులు ఆర్థికంగా లాభాలు పొందుతున్నారు. మరికొందరు అయితే సెలబ్రిటీల ఫోటోలను దుర్వినియోగం చేస్తూ, వారి గోప్యతకు భంగం కలిగించేలా కంటెంట్‌ను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

ఈ క్రమంలో, ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు తమ వ్యక్తిత్వ హక్కులు, గోప్యత హక్కుల పరిరక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఏఐ జనరేటెడ్ కంటెంట్‌పై నియంత్రణలు తీసుకురావాలన్న డిమాండ్ పెరుగుతున్న తరుణంలో, కోర్టుల జోక్యం కీలకంగా మారుతోంది. అకీరా విషయంలో కోర్టు ఎలా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది.