తెలంగాణలో వరదలపై స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

తెలంగాణలో వరదలపై స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

గత మూడురోజులుగా తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు జనం. ఈ క్రమంలో మూసీ నదికి భారీగా వరద నీరు వచ్చి చేరటంతో హైదరాబాద్ లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇళ్ళు నీట మునిగాయి. MGBS బస్ స్టాండ్ లోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరిన పరిస్థితి నెలకొంది. దీంతో పెద్ద బస్ స్టాండ్ జలదిగ్బంధంలో చిక్కుకొని నగరవాసులు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వరదలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. వరద బాధితులకు అండగా నిలవాలని జనసైనికులకు పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్.

హైదరాబాద్ వరద బాధితులకు జనసైనికులు అండగా నిలవాలని పిలుపునిచ్చిన పవన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. హైదరాబాద్ సహా  తెలంగాణాలోని పలు జిల్లాల్లో ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయని.. మూసీ వరదతో ఎంజీబీఎస్ బస్ స్టాండ్ పరిసరాలు నీట మునిగినట్లు తెలిసిందని అన్నారు పవన్ కళ్యాణ్.

 

సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సహాయక చర్యలు చేపట్టిందని అన్నారు. ప్రభుత్వ సూచనలను, వాతావరణ హెచ్చరికలను ప్రజలు అనుసరించాలని సూచించారు పవన్ కళ్యాణ్. వరద బాధితులకు దైర్యం చెప్పి, వారికి అవసరమైన ఆహారం అందించే సేవాకార్యక్రమాల్లో పాల్గొనాలని జనసేన తెలంగాణ నాయకులు, కార్యకర్తలకు ఇప్పటికే దిశానిర్దేశం చేశామంటూ ట్వీట్ చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.