
రాష్ట్రవ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న వేలాది మంది నిరుద్యోగులకు జగన్ ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. డీఎస్సీ నోటిఫికేషన్‌పై తుది కసరత్తు చేస్తోన్నట్లు తెలిపింది. ఆగస్టులో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఓ ప్రకటన చేశారు. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 717 ఉపాధ్యాయ ఖాళీలు మాత్రమే ఉన్నాయని మంత్రి బొత్స బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించారు. కాని 50 వేలకు పైగా ఖాళీలున్నాయని పాఠశాల విద్యాశాఖ నివేదిక పంపించింది.
డీఎస్సీ నోటిఫికేషన్ తో పాటు ఏపీపీఎస్సీ గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి కూడా నోటిఫికేషన్లను విడుదల చేయడానికి చర్యలు తీసుకుంటోన్నట్లు ఏపీ ప్రభుత్వం గతంలోనే వెల్లడించింది. ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వివిధ శాఖలు, విభాగాల్లో ఖాళీగా ఉన్న వందలాది ఉద్యోగాలను భర్తీ చేయడానికి రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వీటికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. రెవెన్యూ, రవాణా, వాణిజ్యం, అటవీ, మున్సిపాలిటీలు, దేవాదాయం, రిజిస్ట్రేషన్లు, గృహనిర్మాణం, ఎక్సైజ్, ఆర్థికం.. వంటి శాఖల్లో ఉన్న వేర్వేరు హోదాల్లో గ్రూప్ 1, గ్రూప్ 2 స్థాయి ఖాళీలు సుమారుగా వెయ్యి వరకు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంతకం చేశారు. గ్రూప్ స్థాయి అధికారుల ఖాళీలను భర్తీ చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గ్రూప్ 1కు సంబంధించి 100, గ్రూప్ 2లో 900కు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా 1000కి పైగా ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రూప్ 1 కేటగిరీలో రీజినల్ ట్రాన్స్‌ఫోర్ట్ ఆఫీసర్, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, డిప్యూటీ ఫారెస్ట్ ఆఫీసర్, గ్రేడ్ 1 మున్సిపల్ కమిషనర్, ఎంపీడీవీఓ ఖాళీలు ఉంటాయి. గ్రూప్ 2 కేటగిరీలో డిప్యూటీ తహశీల్దార్లు, సబ్- రిజిస్ట్రార్లు, గ్రేడ్ 2 మున్సిపల్ కమిషనర్లు, ట్రెజరీ ఆఫీసర్ల ఖాళీలు ఉంటాయి. ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వాటిని భర్తీ చేయనుంది జగన్ ప్రభుత్వం.