ఏపీలో హాట్ టాపిక్ : తీన్ ‘పీకే’.. ఏక్ ఓకే!

ఏపీలో హాట్ టాపిక్ : తీన్ ‘పీకే’.. ఏక్ ఓకే!

అమరావతి: పీకే.. ఈ పేరు ఎక్కడైనా విన్నారా? ‘ఆమిర్ ఖాన్ సినిమానే కదా’ అంటారేమో?! కాదు, కాదు. మీరు పప్పులో కాలేశారు. క్లూ చెప్పమంటారా? ఆంధ్రప్రదేశ్​ఎన్నికల్లో మూడు ‘పీకే’ల పాత్ర చాలా కీలకం. వైఎస్సార్​కాంగ్రెస్​పార్టీ, జనసేన, టీడీపీ.. ఈ మూడు పార్టీల్లో ఒక్కో ‘పీకే’కు స్థానం ఉంది. ఏంటి ఇంకా గుర్తు రాలేదా? సరే అయితే చదవండి. పీకే అంటే ప్రశాంత్ కిశోర్!! పీకే అంటే పవన్​కల్యాణ్!! పీకే అంటే పసుపు–కుంకుమ. ఇప్పుడు ఈ మూడు పీకేల మీదే ఏపీలో చర్చంతా నడుస్తోంది. ఒక పీకే మాత్రమే హిట్​కాగా, ఇంకో రెండు పీకేలు అట్టర్​ఫ్లాప్ అయ్యాయి.

ప్రశాంత్ కిషోర్

దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో సుపరిచితుడు పీకే. రాజకీయ వ్యూహకర్త. 2014 ఎన్నికల్లో బీజేపీ గెలిచి అధికారంలోకి రావడంలో కీలకపాత్ర పోషించారు. తర్వాత బిహార్​లో జేడీయూ కోసం పని చేశారు. అటునుంచి వైఎస్సార్ సీపీ పొలిటికల్ స్ట్రాటజిస్ట్​గా వచ్చారు. ప్రశాంత్ కిశోర్ తన ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐపీఏసీ)తో కలిసి అద్భుతాలు చేశారు. వ్యూహాలు, ప్రతివ్యూహాలు రచించారు. పార్టీని పోలింగ్ బూత్ స్థాయి నుంచి పునర్​నిర్మించారు. రావాలి జగన్, కావాలి జగన్ పాట, నిన్ను నమ్మం బాబు, బై బై బాబు వంటి నినాదాలు ప్రజల్లోకి తీసుకెళ్లారు. వైసీపీకి అఖండ విజయాన్ని అందించారు.

పవన్​కల్యాణ్

యూత్ లో తిరుగులేని ఫాలోయింగ్ ఉన్న సినీ నటుడు. జనసేన పార్టీని స్థాపించి తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ కనీస ప్రభావం చూపలేకపోయారు. పార్టీ ఎక్కడా గెలవలేదు. తాను పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఘోరంగా ఓడిపోయారు.

పసుపు కుంకుమ

తెలుగుదేశం ప్రవేశపెట్టిన పథకం పసుపు–కుంకుమ. ఈ స్కీమ్ కింద ఏపీలోని స్వయం సహాయక సంఘాల్లో ఉన్న 95 లక్షల మందికిపైగా మహిళలకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున ప్రభుత్వం పంపిణీ చేసింది. కానీ ఎన్ని కల ముందు తీసుకొచ్చిన ఈ స్కీమ్ టీడీపీకి ఏ మాత్రం సాయం చేయలేదు. ‘ఫ్యాన్ ’ గాలికి పసుపు–కుంకుమ కొట్టుకు పోయాయి.‘‘పసుపు–కుంకుమ తీసుకుని, ఉప్పు కారం పూసిన ఏపీ మహిళలు’’ అన్న మాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోం ది.