- యూపీఎస్సీ ప్రాసెస్ 4 వారాల్లో పూర్తిచేయాలని ఆదేశం
- ఆ తర్వాతే కౌంటర్ దాఖలు చేయాలని సూచన
- కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 5కు వాయిదా
హైదరాబాద్: హైకోర్టులో డీజీపీ శివధర్ రెడ్డికి ఊరట లభించింది. ఆయన నియామక ఉత్తర్వు లను సస్పెండ్ చేసేందుకు హైకోర్టు నిరాకరిం చింది. రెగ్యులర్ ప్రాసస్ ను నాలుగు వారాల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. యూపీఎస్సీ ప్రక్రియను నాలుగు వారాల్లో పూర్తి చేయాలని ఆదేశిస్తూ ఆ తర్వాతే కౌంటర్ వేయాలని ప్రభు త్వానికి తెలిపింది.
డీజీపీ నియామక ఆర్డర్ ను సస్పెండ్ చేయాలన్న ఇంటర్ లాక్యుటరీ అప్లికే షన్ ను కొట్టేసింది. తదుపరి విచారణను వచ్చే నెల ఫిబ్రవరి 5కి వాయిదా వేసింది. డీజీపీగా బి.శివధర్ రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ, హైదరాబాద్ కు చెందిన సామాజిక కార్యకర్త టీ ధన్ గోపాల్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
2025 సెప్టెంబర్ లో సర్కార్ జారీ చేసిన ఉత్తర్వులు... 2018 నాటి సుప్రీంకోర్టు అదేశాలను ఉల్లంఘించడమేనని పిటిషన్ లో పేర్కొ న్నారు. ఈ పిటిషన్ పై జస్టిస్ పుల్ల కార్తీక్ నిన్న విచారణ చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, కేంద్రం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహ శర్మ, యూపీఎస్సీ కౌన్సెల్ అజయ్ కుమార్ కులకర్ణి వాదనలు వినిపించారు.
కోర్టు ఆదేశాల మేరకు తాము యూపీఎస్సీకి జాబితాను పంపామని, కమిషన్ దాన్ని తిప్పి పంపిందని ఏజీ అన్నారు. కోర్టు ఉత్తర్వులు యూపీఎస్సీకి కూడా వర్తిస్తాయని, రాష్ట్ర జాబితాను తిరిగి పంపకూడదన్నారు. రాష్ట్ర సిఫార్సులను పునః పరిశీలించేలా యూపీఎస్సీని ఆదేశించాలని కోరారు. ఈ విషయంలో కేంద్ర హోం శాఖకు ఎలాంటి పాత్ర లేదని ఏఎస్ జీ న్యాయస్థానానికి తెలిపారు.
ఇది రాష్ట్రానికి, యూపీఎస్సీకి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల అంశమన్నారు. రాష్ట్రం వైపు నుంచి జరిగిన జాప్యం, డీజీపీల నియామకానికి సంబంధించి సుప్రీం ఆదేశాల దృష్ట్యా అటార్నీ జనరల్ ను న్యాయ సలహా కోరామన్నారు. వాదనలు నమోదు చేసుకున్న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చేందుకు నిరా కరించింది.
