ఆకట్టుకున్న ఆ నలుగురు

ఆకట్టుకున్న ఆ నలుగురు

హైదరాబాద్, వెలుగు: ఆంధ్రప్రదేశ్‌‌ అసెంబ్లీ, లోక్‌‌సభ ఫలితాలొచ్చాయి. రికార్డు స్థాయిలో 150 ఎమ్యెల్యే సీట్లు గెలిచిన జగన్‌‌ సీఎం కాబోతున్నారు. 30న ప్రమాణస్వీకారానికి రెడీ అవుతున్నారు. అధికార టీడీపీ 25 సీట్లకే పరిమితమైంది. ప్రతిపక్ష హోదా కన్నా కాస్త ఎక్కువ సీట్లు గెలుచుకుంది. ప్రతిపక్ష నేతగా జగన్‌‌ను బాబు ఎదుర్కోవాల్సిన సమయమొచ్చింది. మార్పు కోసం వచ్చానన్న పవన్‌‌ పార్టీ ఘోర పరాజయం మూటగట్టుకుంది. ఒక్కటంటే ఒక్కటే సీటు గెలిచింది. తాను పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ పవన్‌‌ ఓడిపోయారు. మరి బాబు, పవన్‌‌ల నెక్స్ట్‌‌ కార్యాచరణేంటి?

సంకల్ప యాత్రతో ప్రజల్లోకి

2009లో తండ్రి వైఎస్సార్‌‌ మరణం తర్వాత జగన్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. వైఎస్సార్‌‌ మరణం తట్టుకోలేక చనిపోయిన వారిని పరామర్శిస్తానన్న జగన్‌‌కు అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అనుమతి ఇవ్వకపోవటంతో కాంగ్రెస్ నుంచి బయటకొచ్చారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌‌ పార్టీ (వైఎస్సార్‌‌సీపీ)ని 2011 మార్చి12న స్థాపించారు. ఎంపీ పదవికి జగన్, ఎమ్మెల్యే పదవికి తల్లి విజయమ్మ రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. 2014 లో 67 ఎమ్మెల్యే, 9 ఎంపీ సీట్లు గెలిచారు. ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేశారు. ప్రజా సంకల్ప యత్రతో ప్రజల్ని పలకరించారు. మూడేళ్లు ప్రజా క్షేత్రంలో ఉండి ప్రజా సమస్యలపై పోరాడారు. దీంతో ఈసారి జగన్‌‌కే ప్రజలు పట్టం కట్టారు.

విపక్ష నేతగా బాబుండరా?

ఏపీలో ఫ్యాన్‌‌ గాలికి టీడీపీ అధినేత చంద్రబాబు తప్ప హేమాహేమీలు చాలా మంది కొట్టుకుపోయారు. ఓట్ల లెక్కింపు చివరి దశకు చేరుకునే సరికి టీడీపీ 24 సీట్లకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో సభలో ప్రతిపక్షనేతగా జగన్‌‌ను ఎదుర్కోవడం బాబు ఇబ్బందికరంగా భావిస్తున్నట్లు తెలిసింది. ఆ పదవిని మరొకరి ఇచ్చే అవకాశమున్నట్టు సమాచారం. ఇక బీజేపీకి స్పష్టమైన మెజార్టీ రాకుంటే కేంద్రంలో చక్రం తిప్పుదామని బాబు భావించారు. కానీ ఇప్పుడాయన పరిస్థితి రెండింటికి చెడ్డ రేవడిలా తయారైంది. రానున్న రోజుల్లో బాబు ఏం చేస్తారో త్వరలో స్పష్టత రావొచ్చు.

ప్రశ్నించేందుకు ఒక్కరే

ప్రశ్నించడం కోసమే రాజకీయాల్లోకి వచ్చానన్న జనసేనాని పవన్‌‌కు ఈ ఎన్నికలు కోలుకోలేని షాకిచ్చాయి. అసెంబ్లీ, లోక్‌‌సభ సీట్లలో కనీస పోటీ  ఇవ్వలేకపోయారు. ఆయన పోటీ చేసిన రెండు స్థానాల్లో (విశాఖ జిల్లా గాజువాక, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం) ఓడిపోయారు. గాజువాకలో మూడో స్థానానికి పరిమితమయ్యారు. మొత్తంగా ఆయన పార్టీ ఒకే ఒక సీటు గెలిచింది. తూర్పు గోదావరి జిల్లాలో రాజోలులోనే విజయం సాధించింది. ఎంపీలుగా పోటీ చేసిన నాగబాబు, ఐపీఎస్ అధికారి లక్ష్మినారాయణ కూడా కనీస పోటీ ఇవ్వలేకపోయారు. రానున్న రోజుల్లో ఆయన సినిమాలకు పరిమితమవుతారా? రాజకీయాల్లో కొనసాగుతారా? తెలియాల్సి ఉంది.

ఏమైంది పాల్‌‌?

ప్రజా శాంతి పార్టీని స్థాపించి ఎన్నికల్లో పోటీ చేసిన కేఏ పాల్ కేవలం 407 ఓట్లే సాధించారు. ఏపీలో చాలా చోట్ల అభ్యర్థులను నిలిపి ప్రచారంలోనూ హడావుడి చేసిన పాల్‌‌ తాను పోటీ చేసిన నరసాపురం లోక్‌‌సభ స్థానంలో డిపాజిట్‌‌ కూడా దక్కించుకోలేకపోయారు.