ఏపీలో 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలింపు

ఏపీలో 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలింపు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కేసుల పాజిటివిటీ రేటు 5శాతం కన్నా తక్కువ ఉన్న జిల్లాల్లో సడలింపులు కల్పించారు. 8 జిల్లాల్లో ఇప్పటి వరకు కర్ఫ్యూ సడలింపు  ఉదయం 6 నుంచి  సాయంత్రం 6 వరకు ఉండగా.. ఆంక్షల సడలింపును  ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకూ పొడిగించారు. రాత్రి 9గంటలకు దుకాణాలు, రెస్టారెంట్లు ఇతరత్రా అన్నీ మూసివేయాల్సి ఉంటుంది. రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకూ కర్ఫ్యూ కొనసాగుతుంది. 
ఆ 5 జిల్లాల్లో కర్ఫ్యూ యధాతథం
ఉభయ గోదావరి, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షల సడలింపు ఇప్పటి వరకు ఉన్న విధానమే యధాతథంగా కొనసాగుతుంది. అంటే సాయంత్రం 6 గంటల వరకే సడలింపు ఉంటుంది. ఈ జిల్లాల్లో సాయంత్రం 6 నుంచి ఉదయం 6గంటల వరకూ కర్ఫ్యూ కొనసాగుతుంది. ఈ జిల్లాల్లో కరోనా పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా ఎక్కువగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కొత్త సడలింపులు జులై 1 నుంచి జులై 7 వరకు అమలులో ఉంటాయి. కరోనా పాజిటివిటీ రేటు పరిశీలించాక ఈజిల్లాల్లో సడలింపుపై మళ్లీ నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది.