ఏపీలో ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు బంద్...! సోషల్ మీడియాలో వార్తలపై క్లారిటీ..

ఏపీలో ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు బంద్...! సోషల్ మీడియాలో వార్తలపై క్లారిటీ..

ఇంధనం పొదుపు చేయాలంటూ దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంధన పొదుపులో భాగంగా దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు మూతపడతాయంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో జనంలో ఆందోళన మొదలైంది. మళ్ళీ పెట్రోల్ కష్టాలు తప్పేలా లేవు అన్న భయం మొదలైంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది ఏపీ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ యూనియన్. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని.. ఆ వీడియోలు 2017-18 నాటి విడియోలని తెలిపారు. 

దేశంలో ఆయిల్ కొరత లేదని అపోహలను నమ్మొద్దని కోరారు యూనియన్ అధ్యక్షులు గోపాలకృష్ణ. రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకులు యధావిధిగా పనిచేస్తాయని స్పష్టం చేశారు. దేశంలో ఇంధన సరఫరా సజావుగానే ఉందని...ఏరోజూ బంకులను మూసేసే ఆలోచన ప్రభుత్వానికి డీలర్ల అసోసియేషన్ కు లేదని అన్నారు.

ఒకవేళ ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తుందని..సోషల్ మీడియాలో వచ్చే వార్తలను గుడ్డిగా నమ్మొద్దని సూచించారు. ఆదివారం అన్ని ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ బంకులు అందుబాటులో ఉంటాయని.. ఎలాంటి ఆందోళన అవసరం లేదని అన్నారు.