లారీ ఓనర్స్ తలపెట్టిన బంద్ నివారించేందుకు చర్యలు చేపట్టింది ఏపీ సర్కార్. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆందోళన విరమింపజేసేందుకు చర్యలు చేపట్టింది రవాణాశాఖ. ఈ క్రమంలో లారీ ఓనర్స్ అసోషియేషన్ నేతలతో చర్చలు జరుపుతున్నారు రవాణాశాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా. 13 నుంచి 20 ఏళ్లు దాటిన రవాణా వాహనాలపై కేంద్రం బారీగా ఫిట్ నెస్ ఫీజులు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు లారీ ఓనర్స్.
డిమాండ్ల పరిష్కరించే అంశంపై లారీ యజమానులతో చర్చలు జరుపుతున్నారు రవాణాశాఖ కమిషనర్. ఇవాళ ( డిసెంబర్ 9 ) అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగుతామని లారీ ఓనర్స్ ప్రకటించిన క్రమంలో ఈ చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇదిలా ఉండగా.. ఇటీవల కేంద్రం పెంచిన టెస్టింగ్, ఫిట్ నెస్ ఫీజులు తగ్గించాలని డిమాండ్ చేస్తూ బంద్ కు పిలుపునిచ్చాయి లారీ ఓనర్స్ సంఘాలు. ఫీజు తగ్గించని పక్షంలో డిసెంబర్ 9 అర్థరాత్రి నుంచి రాష్ట్రంలో గూడ్స్ రవాణా నిలిపివేస్తామని తెలిపారు.
13 ఏళ్లు దాటిన వాహనాల ఫిట్‌నెస్ ఫీజు కేంద్రం భారీగా పెంచిందని... యజమానులపై భారం పడుతోందని అంటున్నారు. 20 ఏళ్లు దాటిన పాత వాహనాల ఫీజు రూ33వేల 400కు పెంచారని.. ఈ పెంపు వల్ల వేలాది మంది లారీ ఓనర్స్ తీవ్రంగా నష్టపోతారని అంటున్నారు. పాత వాహనాలపై అదనపు టెస్టింగ్, ఫిట్‌నెస్ ఛార్జీలు పెంపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అంటున్నారు అసోసియేషన్ సభ్యులు.

