
- వారంలోనే 20 టీఎంసీలను ఏపీకి మళ్లించారన్న తెలంగాణ ఈఎన్సీ
- చెప్పిన లెక్కకంటే ఎక్కువగా పోతిరెడ్డిపాడు నుంచి తరలించినట్లు కృష్ణాబోర్డుకు ఫిర్యాదు
- రోజుకో టీఎంసీ నీటికి గండి
- రీడింగ్ తీసేందుకు వెళ్లిన మా ఇంజనీర్లను అడ్డుకుంది
- మౌనంగా ఉండటం సరికాదు
- ఇలాగైతే బోర్డుపై నమ్మకం లేకుండా పోతుంది
- వెంటనే చర్యలు చేపట్టాలని ఈఎన్సీ డిమాండ్
- అటు నీళ్లపై ఇద్దరు సీఎంల మధ్య సయోధ్య
- ఇటు శ్రీశైలం నుంచి తప్పుడు లెక్కలతో నీళ్ల తరలింపు
హైదరాబాద్, వెలుగు: ఇద్దరు సీఎంలు సయోధ్యగా ఉంటామని ఎంతగా చెప్తున్నా కూడా.. అటు కృష్ణా జలాల్లో ఏపీ సర్కారు దోపిడీ కొనసాగుతూనే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి తరహాలోనే ఇప్పుడు కూడా తప్పుడు లెక్కలు చూపుతూ శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటి తరలింపు జరిగిపోతోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి రోజుకు నాలుగు టీఎంసీల చొప్పున.. గత నాలుగైదు రోజుల్లోనే 20 టీఎంసీలకుపైగా నీటిని మళ్లించుకుంది. వాటా లెక్కలకు చిక్కకుండా రోజుకో టీఎంసీని తప్పుడు లెక్కలతో కాజేస్తోంది. దీనిపై సందేహం వచ్చి వాటర్ రీడింగ్ తీసేందుకు వెళ్లిన తెలంగాణ ఇంజనీర్లను ఏపీ సర్కారు అడ్డుకుంది. దీంతో షాక్ అయిన రాష్ట్ర ప్రభుత్వం.. ఏపీ జల దోపిడీపై కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. రాష్ట్ర ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్‌రావు గురువారం కృష్ణా బోర్డు చైర్మన్‌కు లేఖ రాశారు. ఏపీ సర్కారు తీరుతో కృష్ణా బోర్డుపైనే నమ్మకం లేకుండా పోతోందని స్పష్టం చేశారు. పోతిరెడ్డిపాడు నుంచి తరలించుకుపోతున్న నీటి లెక్కలను తక్కువ చేసి చూపిస్తోందని ఫిర్యాదు చేశారు. ఇరు రాష్ట్రాల మధ్య సన్నిహిత సంబంధాలున్నప్పటికీ.. నీళ్ల తరలింపు లెక్కలను ఎందుకు దాచి పెడుతున్నారని ప్రస్తావించారు.
ఇంతలోనే ఏమైంది!
గోదావరి నీళ్లతో రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని నాలుగు రోజుల కింద తిరుమల పర్యటనలో సీఎం కేసీఆర్ ప్రకటించటం తెలిసిందే. మరోవైపు ఏపీ సీఎం వైఎస్ జగన్ గోదావరి–-కృష్ణా నదుల అనుసంధానానికి ఆర్థిక సాయం అందించాలని కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు లేఖ రాశారు. కొద్దిరోజులుగా రెండు రాష్ట్రాల సీఎంల మధ్య సయోధ్య బలపడిందనే ప్రచారం జరిగింది. కానీ ఇదే టైమ్‌లో పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్ల దోపిడీపై తెలంగాణ ప్రభుత్వం ఘాటుగా ఫిర్యాదు చేయటం సంచలనంగా మారింది. కొంతకాలంగా పోతిరెడ్డిపాడు, కృష్ణా జలాలపై చూసీ చూడనట్టు ఉన్న సర్కారు ఒక్కసారిగా ఎందుకు ఉలిక్కి పడిందనేది సందేహాలకు తావిస్తోంది.
ఇప్పటికే 20 టీఎంసీలు తరలింపు
కర్ణాటకలో కురిసిన వర్షాలు, తుంగభద్ర ఉప్పొంగడంతో గత వారంలో శ్రీశైలంలో నీటి మట్టం ఒక్కసారిగా పెరిగింది. ఆగస్టు 8వ తేదీ నాటికే మంచి స్థాయికి చేరింది. దీంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి రోజుకు 37 వేలకుపైగా క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. వచ్చే నెల ఒకటో తారీఖు నాటికి పోతిరెడ్డిపాడు ద్వారా 23 టీఎంసీల నీటిని వాడుకుంటామని ఏపీ ప్రభుత్వం ఈనెల 9న జరిగిన కృష్ణా బోర్డు మీటింగ్‌లో ఇండెంట్ ఇచ్చింది. కానీ దీనికి ఇరు రాష్ట్రాల అంగీకారం కుదరలేదు, బోర్డు ఆమోదం ఇవ్వలేదు. కానీ ఈలోగానే అడిగినంతా తరలించేసింది.
గత వారం రోజుల్లోనే దాదాపు ఇరవై టీఎంసీల నీటిని వాడుకున్నారని.. అందులో రోజుకు ఒక టీఎంసీ చొప్పున దొంగ లెక్కలతో కాజేశారని తెలంగాణ ఇంజనీర్లు చెప్తున్నారు. నిరుడు 44 రోజుల్లోనే పోతిరెడ్డిపాడు ద్వారా 144 టీఎంసీల శ్రీశైలం నీటిని ఏపీ ప్రభుత్వం ఖాళీ చేసింది.
ఇంజనీర్లను అడ్డుకున్నారు
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటి తరలింపుపై ఏపీ సర్కారు తప్పుడు నివేదికలు సమర్పిస్తోదంటూ తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్‌రావు కృష్ణా బోర్డుకు లేఖ రాశారు. పోతిరెడ్డిపాడు నుంచి ఎంత నీటిని వాడుకుంటున్నారనే లెక్క తీసేందుకు వెళ్లిన ‘కేఆర్ఎంబీ జాయింట్ టీమ్’ అధికారులను అనుమతించ లేదని ఫిర్యాదు చేశారు. ఈ నెల 8న వెళ్లిన అధికారులను ఏపీ ఇరిగేషన్ అధికారులు అడ్డుకున్నారని, తర్వాతి రోజు జరిగిన మీటింగ్‌లో ఈ విషయాన్ని బోర్డు దృష్టికి తీసుకొచ్చామని చెప్పారు.
ఏమిటీ వివాదం?
కృష్ణా, తుంగభద్ర బేసిన్లో ఎగువన కురిసిన వర్షాలతో శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో నీళ్లు నిండాయి. శ్రీశైలం రిజర్వాయర్ గరిష్ట మట్టం 885 అడుగులు. ఇక్కడ నీటి మట్టం 854 అడుగులకు మించితే.. ఫోర్ షోర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమకు నీటిని తరలించుకునే వీలుంది. ఏకంగా 44 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహానికి వీలుగా.. అంటే రోజుకు నాలుగు టీఎంసీల నీటిని శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఖాళీ చేసేలా దాన్ని డిజైన్ చేశారు. రిజర్వాయర్ మొత్తం ఖాళీ అయ్యేలా డీప్ కట్ డిజైన్‌తో కట్టిన ఈ ప్రాజెక్టు ఉమ్మడి రాష్ట్రంలో చాలా వివాదాలకు కారణమైంది.
లేఖలోని కీలక పాయింట్లు ఇవీ..
8వ తేదీన పోతిరెడ్డిపాడు ద్వారా నీటి తరలింపు రీడింగ్‌ను తీసుకునేందుకు జాయింట్ టీమ్ వెళితే ఏపీ ఇంజనీర్లు అడ్డుకున్నారు.
ఈ విషయాన్ని 9న కృష్ణా బోర్డు మీటింగ్‌లో ప్రస్తావించడంతో తర్వాతి మూడు రోజులు అనుమతించారు.
పదో తేదీ నుంచి 12వ తేదీ వరకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 3 కిలోమీటర్లు, 12.2 కిలోమీటర్లు దిగువన జాయింట్ టీమ్ నీటి ప్రవాహాన్ని పరిశీలించింది.
13న జాయింట్ టీమ్‌ను మళ్లీ అడ్డుకున్నారు. అందువల్ల రీడింగ్ తీసిన మూడు రోజుల లెక్కలనే నివేదిస్తున్నం.
ఈ మూడు రోజులు కూడా రోజూ 28 వేల క్యూసెక్కుల చొప్పున విడుదలైనట్టు ఏపీ ఇంజనీర్లు చెప్పారు. కానీ మాఇంజనీర్ల రీడింగ్‌లో 10వ తేదీన 33,266 క్యూసెక్కులు, 11న 34,888 క్యూసెక్కులు, 12న 38,851 క్యూసెక్కులు విడుదలైనట్టు తేలింది.
మూడు రోజుల్లో కలిపి 7.26 టీఎంసీలు తరలించినట్టు ఏపీ అధికారులు చెప్పారు. జాయింట్ టీమ్ ఇంజనీర్ల లెక్కల ప్రకారం.. 9.24 టీఎంసీలు విత్ డ్రా అయ్యాయి. టెలిమెట్రీలోనూ ఇవే లెక్కలు నమోదయ్యాయి.
మొత్తంగా ఎనిమిదో తేదీ నుంచి 14వ తేదీ వరకు 20 టీఎంసీలకుపైగా తరలించినట్టు స్పష్టంగా కనిపిస్తోంది.
కృష్ణా బోర్డు ఆదేశాలను ఏపీ పట్టించుకోవడం లేదు. దీనిపై బోర్డు మౌనంగా ఉండటం మంచిది కాదు. ఇలాంటి తప్పుడు నివేదికలతో బోర్డుపై నమ్మకం పోతుంది.
కృష్ణా జలాల అంశంలో రెండు రాష్ట్రాల జాయింట్ టీం అధికారులు ఎక్కడైనా వాటర్ రీడింగ్ తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఏపీ సహకరించడం లేదు. కృష్ణా జలాలపై రెండు రాష్ట్రాల మధ్య అవగాహన చాలా అవసరం. ఎవరి వాటా ఎంత, ఎంత మేరకు వాడుకుంటున్నారనే విషయాలు స్పష్టంగా ఉండాలి.