అచ్చంపేట ఎత్తిపోతలను నిలిపివేయండి..కేఆర్ఎంబీకీ ఏపీ ప్రభుత్వం లేఖ

అచ్చంపేట ఎత్తిపోతలను నిలిపివేయండి..కేఆర్ఎంబీకీ ఏపీ ప్రభుత్వం లేఖ


హైదరాబాద్, వెలుగు: పాలమూరు-–రంగారెడ్డి లిఫ్ట్‌‌ స్కీములో భాగంగా చేపడుతున్న అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని నిలిపివేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌‌ఎంబీ)ను ఏపీ కోరింది. ఈ మేరకు బోర్డు చైర్మన్ శివానందన్ కుమార్‌‌కు ఏపీ జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ లేఖ రాశారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాని కి అనుమతి లేదని, ప్రాజెక్టు వెంబడి గ్రామాలకు తాగు నీరు అందించేందుకు 7.5 టీఎంసీలతో పనులు చేప ట్టేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందని గుర్తు చేశా రు. 

అయితే సాగు, తాగునీటి అవసరాల కోసం 90 టీఎంసీలతో పనులు జరుగుతున్నాయని, అచ్చంపేటలో రూ.1,534 కోట్లతో 2.5 టీఎంసీల నీటిని తరలించేందుకు వీలుగా లిఫ్ట్‌‌ పథకం చేపడుతున్నారని ఆరోపించింది. ఏపీ  పునర్‌‌వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం, ఏదైనా కొత్త నిర్మాణ ప్రాజెక్టుకు అపెక్స్ కౌన్సిల్,  సీడబ్ల్యూసీ, కృష్ణా బోర్డు ఆమోదం అవసరమని అన్నారు. అందువల్ల అచ్చంపేట ఎత్తిపోతల పథకానికి సంబంధించిన డీపీఆర్‌‌ను సమర్పించేలా తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని బోర్డును ఏపీ కోరింది.