
అమరావతి, వెలుగు: అమరావతి నుంచి రాజధాని తరలింపుపై జోక్యం చేసుకోబోమని ఏపీ హైకోర్టు తేల్చి చెప్పింది. రాజధానిని తరలిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయలేదని పేర్కొంది. అమరావతి తరలింపును ఆపాలంటూ దాఖలైన పిటిషన్ ను చీఫ్ జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, జస్టిస్ మంథాట సీతారామమూర్తి లతో కూడిన బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. రాజధాని తరలింపుపై అత్యవసరంగా విచారణ జరపాలన్న లాయర్ సుబ్బారావు అభ్యర్థనను తోసిపుచ్చింది. తరలింపుపై ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులే విడుదల కానప్పుడు ఎలా జ్యోకం చేసుకోగలమని పిటిషనర్ ను ప్రశ్నించింది. రాజధాని తరలించేందుకు ప్రభుత్వం నిర్ణయించినా అది ఒక్క రోజులో పూర్తయ్యే ప్రక్రియ కాదని, అందువల్ల ఈ విషయంలో అత్యవసర విచారణ జరపాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది.
రాజధాని తరలింపుపై ఇప్పటికే దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు హైకోర్టు బెంచ్ ప్రకటించింది. అమరావతి తరలింపు ద్వారా స్టేక్ హోల్డర్స్ ఎవరైనా నష్టపోతే పిటిషన్ వేసుకోవాలని సూచించింది. అత్యవసరం అని భావిస్తే సంక్రాంతి సెలవుల తర్వాత పిటిషన్ వేయొచ్చని స్పష్టం చేసింది.