
- పీపీఏల రివ్యూపై ఏపీ ప్రభుత్వ వాదనకు సమర్థన
అమరావతి: విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)పై సమీక్ష వ్యవహారంలో విద్యుత్ కంపెనీలకు షాక్ తగిలింది. పీపీఏలపై రివ్యూ చేసే అవకాశమే లేదన్న కంపెనీల వాదనల్ని హైకోర్టు కొట్టిపారేసింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన కొనుగోలు ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయని, ప్రజాధనం వృదా చేశారని వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం హైకోర్టులో వాదించింది. ఈ ఒప్పందాలను ఏపీఈఆర్సీ ద్వారా సమీక్షిస్తామని తెలిపింది. ఈ వాదనలను కోర్టు సమర్థించింది. ఇకపై పీపీఏల రివ్యూకు సంబంధించి ఏవైనా వాదనలుంటే ఏపీఈఆర్సీ ఎదుటే వినిపించాలని సూచించింది. ఆరు నెలల్లోగా ఈ వ్యవహారాన్ని తేల్చాలని ఏపీఈఆర్సీకి స్పష్టం చేసింది.
ప్రభుత్వం చెప్పిన రేటుకూ ఓకే
ఈ ఆరు నెలల్లోపు మధ్యంతర చెల్లింపుకింద యూనిట్‌కు రూ. 2.43 నుంచి రూ.2.44 చెల్లిస్తామన్న ప్రభుత్వ వాదనకూ హైకోర్టు ఓకే చెప్పింది. ప్రభుత్వం నోటీసులు ఇచ్చి చట్టం ప్రకారం విద్యుత్ ఉత్పత్తిని నిలిపి వేసే హక్కు కూడా ఉంటుందని స్పష్టం చేసింది. పీపీఏలపై రివ్యూ వ్యవహారం గతంలో ప్రభుత్వం కోరిన విధంగా ఏపీఈఆర్సీ వద్దకు చేరడంతో హైకోర్టు తన మధ్యంతర ఉత్తర్వులను పక్కన పెడుతున్నట్లు చెప్పింది.