సినిమా పైరసీ సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని త్వరలోనే నిర్దోషిగా బయటికి తీసుకొస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ హైకోర్టు లాయర్ పెటేటి రాజారావు. గురువారం ( నవంబర్ 27 ) హైదరాబాద్ బషీర్ బాగ్ లోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు రాజారావు. ఇమ్మడి రవి కేసు విషయంలో కోర్టులో చట్టపరంగా బలమైన వాదనలు వినిపించి త్వరలోనే రవిని జైలు నుంచి బెయిల్ పై విడుదల చేయిస్తానని అన్నారు.
ఇమ్మడి రవి కేసులో పోలీసులు పెట్టిన సెక్షన్లు బెయిలబుల్ సెక్షన్స్ అని తెలిపారు రాజారావు. త్వరలోనే రవి తండ్రిని కలిసి దైర్యం చెప్తానని అన్నారు. రవి చేసింది తప్పే కానీ.. తెలుగు ప్రజల మద్దతు అతనికి ఉందని అన్నారు రాజారావు. ప్రజల పక్షాన న్యాయస్థానంలో తాను వాదించి.. న్యాయాన్ని గెలిపిస్తానని, రవిని త్వరలోనే నిర్దోషిగా బయటికి తీసుకొస్తానని అన్నారు రాజారావు.
ఐబొమ్మ పైరసీ కేసులో రవిని మూడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 29వ తేదీ వరకు రవిని కస్టడీలో విచారించనున్నట్టు సైబర్ క్రైమ్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో రిమాండ్ లో ఉన్న ఇమ్మడి రవిని గురువారం ఉదయం జైలు నుంచి కస్టడీలోకి తీసుకోనున్నారు.
ఐబొమ్మ పైరసీ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించిన ఇమ్మడి రవిని బుధవారం కోర్టులో హాజరుపరిచారు. అనంతరం సైబర్ క్రైమ్ పోలీసులు మరో కేసులో కూడా పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఆ కేసులో కోర్టు14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
ఇప్పటివరకు రవి పై మొత్తం ఐదు కేసులు నమోదైనట్టు సమాచారం. తాజాగా మరో కేసులో రిమాండ్ విధించగా, మిగిలిన మూడు కేసుల్లో కూడా పీటీ వారెంట్ వేసిన సైబర్ క్రైమ్ పోలీసులు, కోర్టు అనుమతి పొందిన వెంటనే ఆ కేసుల్లో కూడా అరెస్ట్ చూపనున్నారు.
