బూడిదను నిందించకండి: మహారాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్

బూడిదను నిందించకండి: మహారాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్

ముంబై: మహారాష్ట్రలో గాలి నాణ్యత క్షీణించడంతో రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. ఇథియోపియా నుంచి వచ్చిన అగ్నిపర్వత బూడిద మేఘాలు కమ్ముకోవడం వల్లే ముంబై, ఇతర నగరాల్లో గాలి నాణ్యత క్షీణించిందన్న ప్రభుత్వ వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది. బూడిద మేఘాలు రాకముందే రాష్ట్రంలో వాయు కాలుష్యం పెరిగిందని ప్రభుత్వానికి చురకలంటించింది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని రాష్ట్రంలో వాయు కాలుష్య నివారణకు చర్యలు చేపట్టాలని సూచించింది. 

ముంబైలో రోజురోజుకు పెరుగుతున్న వాయు కాలుష్యంపై హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్‎పై గురువారం (నవంబర్ 27) ప్రధాన న్యాయమూర్తి చంద్రశేఖర్, జస్టిస్ గౌతమ్ ఎ అంఖాద్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. మహారాష్ట్ర ప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాది జ్యోతి చవాన్.. 2025, నవంబర్ 23న ఇథియోపియాలోని హేలి గుబ్బి అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడంతో భారతదేశం అంతటా బూడిద మేఘం కమ్ముకుందని అన్నారు.

దీనివల్లే మహారాష్ట్రలో గాలి నాణ్యత మరింత దిగజారిందని, ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో వాయు నాణ్యత సూచిక (ఎక్యూఐ) 300 దాటిందని పేర్కొన్నారు. వెంటనే ప్రధాన న్యాయమూర్తి చంద్రశేఖర్ జోక్యం చేసుకుని.. లేదు, లేదు.. బూడిద మేఘాలు రెండు రోజుల క్రితమే వచ్చాయి.. అగ్నిపర్వత విస్ఫోటనం జరగడానికి చాలా కాలం ముందు కూడా ఆర్థిక రాజధానిలో దృశ్యమానత తక్కువగా ఉంది. 500 మీటర్లకు మించి చూడలేకపోయమంటూ ప్రభుత్వ వాదనను తిరస్కరించారు.

ఎన్జీఓ వంశశక్తి తరపున సీనియర్ న్యాయవాది జనక్ ద్వారకాదాస్ వాదిస్తూ.. కోర్టు వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. అయితే.. వాయు కాలుష్య నివారణకు ఏ చర్యలు తీసుకోవచ్చో మీరు చెప్పండి.. అత్యంత ప్రభావవంతమైన చర్యలు ఏమిటని ద్వారకాదాస్‌‎ను ప్రశ్నించారు. అనంతరం.. ప్రతి సంవత్సరం శీతాకాలంలో కాలుష్యంతో బాధపడుతున్న ఢిల్లీలో అక్కడి ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితాలను కూడా పరిశీలించాలని ప్రభుత్వానికి ధర్మాసనం సూచించింది.