ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో జట్ల సంఖ్యను పెంచే ఉద్దేశ్యంలో బీసీసీఐ ఉంది. ప్రస్తుతం ఐదు జట్లు ఉన్న సంగతి తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్ మహిళా ప్రీమియర్ లీగ్ ఆడుతున్నాయి. 2023లో ప్రారంభమైన మహిళా ఐపీఎల్..ఇప్పటికీ మూడు సీజన్ లు పూర్తి చేసుకుంది. మూడు సీజన్ ల పాటు ఐదు జట్లు ఆడాయి. అయితే ఈ లీగ్ లో తొలిసారి ఒక కొత్త జట్టు అదనంగా చేరనుంది. WPL 2026 మెగా వేలం సందర్భంగా ఢిల్లీ క్యాపిటల్స్ (DC) కో ఓనర్ పార్థ్ జిందాల్ మహిళా ఐపీఎల్ లో కొత్త జట్టు వస్తుందని కాన్ఫిడెంట్ గా చెప్పారు.
పార్థ్ జిందాల్ మాట్లాడుతూ.."డబ్ల్యూపీఎల్ లో బీసీసీఐ మరో జట్టును జోడిస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. కొత్త జట్టు వచ్చిన తర్వాత అన్ని జట్లు హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్ లు ఆడతాయి. కొత్త జట్టును చేర్చే ఆలోచనలో బీసీసీఐ ఉంది. ఈ విషయాన్ని పరిశీలిస్తుంది. ప్రస్తుతం ఉమెన్స్ వరల్డ్ కప్ లో తక్కువ మ్యాచ్ లు జరుగుతున్నాయి". అని జిందాల్ ఢిల్లీలో విలేకరులతో అన్నారు. కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ లలో ఒక జట్టు ఐపీఎల్ లో అదనంగా చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్ 2027 సీజన్ లో కొత్త జట్టు రావొచ్చు.
చివరి రెండు సీజన్ లలో మహిళల ప్రీమియర్ లీగ్ భారీ విజయాన్ని సాధించింది. ఈ కారణంగానే బీసీసీఐ జట్ల సంఖ్యను పెంచాలని భావించినట్టు సమాచారం. ప్రస్తుతం ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఐపీఎల్ 2026 సీజన్ కోసం రెండు వేదికలకు పరిమితం చేయబడింది. నవీ ముంబై, వడోదర షార్ట్‌లిస్ట్ చేయబడ్డాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 మెగా యాక్షన్ జరుగుతోంది. మొత్తం 277 మంది ప్లేయర్స్ మెగా ఆక్షన్ లోకి వచ్చారు. ఇందులో 73 స్థానాల కోసం ప్లేయర్స్ పోటీ పడనున్నారు. 194 మంది భారత ప్లేయర్స్ ఉన్నారు. వీరిలో 52 మంది క్యాప్డ్ ప్లేయర్స్ ఉండగా, 142 మంది అన్ క్యాప్డ్ ప్లేయర్స్ ఉన్నారు.
ఈ మెగా ఆక్షన్ లో ఇప్పటివరకు జరిగిన హైలెట్స్ చూస్తే.. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ దీప్తి శర్మకు భారీ ధర లభించింది. యూపీ వారియర్స్ ఈ ఆల్ రౌండర్ ను రూ. 3.2 కోట్లకు కొనుగోలు చేసింది. న్యూజిలాండ్ యంగ్ ఆల్ రౌండర్ అమేలియా కెర్ ను ముంబై ఇండియన్స్ రూ. 3 కోట్ల ధరకు సొంతం చేసుకుంది. ఇటీవలే బిగ్ బాష్ లీగ్ లో మెరుపు సెంచరీ చేసిన మెగ్ లానింగ్ ను 1.9 కోట్లకు యూపీ వారియర్స్ దక్కించుకుంది.భారత స్పిన్నర్ శ్రీ చరనికి మంచి ధర లభించింది. రూ. 1.3 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ఆఫ్ స్పిన్నర్ ను దక్కించుకుంది.
సీనియర్ ప్లేయర్, గత సీజన్ లో ఆర్సీబీ జట్టుకు ఆడిన సోఫీ డివైన్ ను రూ. 2 కోట్లకు గుజరాత్ జెయింట్స్ కొనుగోలు చేసింది. ఇంగ్లాండ్ స్టార్ స్పిన్నర్ సోఫీ ఎక్లెస్టోన్ ను కూడా యూపీ వారియర్స్ దక్కించుకోవడం విశేషం. ఆస్ట్రేలియా ఓపెనర్ లిచ్‌ఫీల్డ్ ను కూడా యూపీ వారియర్స్ దక్కించుకుంది. వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియాపై సెంచరీ కొట్టిన ఈ ఆసీస్ ఓపెనర్ ను రూ.1.2 కోట్లకు కొనుగోలు చేసింది.
