తంజావూరు: తమిళనాడులోని తంజావూరులో ఘోరం జరిగింది. ప్రియురాలిపై ప్రేమోన్మాది విచక్షణా రహితంగా కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన ఆమె చాలా రక్తం పోవడంతో స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. తంజావూరులోని కలకుడి పరంతై ప్రాంతానికి పున్నియమూర్తి కూతురు కావ్య. ఆయన కూతురు కావ్య అలంగుడిలోని ప్రభుత్వ ఆది ద్రావిడర్ ప్రాథమిక పాఠశాలలో టీచర్గా పనిచేస్తోంది. ఆమెకు, తంజావూరుకు చెందిన పెయింటర్ అజిత్ కుమార్కు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. ఇద్దరికీ 15 ఏళ్ల వయసు నుంచే స్నేహం ఉంది. ఒక వయసుకొచ్చాక ఇద్దరూ ప్రేమించుకున్నారు. 13 సంవత్సరాలుగా ఇద్దరూ ప్రేమలోనే ఉన్నారు. అయితే.. ఈ ఇద్దరి పెళ్లికి కావ్య కుటుంబం ఒప్పుకోలేదు. ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి కుదిరింది. నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే.. ఈ విషయాన్ని అజిత్ కుమార్‌కు కావ్య చెప్పలేదు.
బుధవారం రాత్రి.. కావ్యకు అజిత్ కాల్ చేశాడు. ఇక దాచడం మంచిది కాదని భావించిన కావ్య.. తనకు నిశ్చితార్థం కూడా జరిగిందని.. ఇకపై దూరంగా ఉందామని చెప్పింది. ఈ మాటలకు అజిత్ రగిలిపోయాడు. నిశ్చితార్థం జరిగిందంటే తాను నమ్మలేనని కావ్యతో వాదించాడు. నిజంగానే జరిగిందని.. నిశ్చితార్థం ఫొటోలను కావ్య అజిత్కు పంపింది. ఆ ఫొటోలు చూసిన అజిత్ కుమార్ కోపంగా.. "నాకు ఏం చెప్పకుండా వేరే వ్యక్తితో ఎలా నిశ్చితార్థం చేసుకుంటావు ? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. వేరే ఎవరినీ నిన్ను పెళ్లి చేసుకోనివ్వను" అని చెప్పి ఫోన్ కాల్ డిస్ కనెక్ట్ చేశాడు.
గురువారం ఉదయం కావ్య స్కూల్కు స్కూటీపై వెళుతుండగా.. మరియమ్మన్ ఆలయం దగ్గర అజిత్ కుమార్ ఆమెను అడ్డగించాడు. తనను ప్రేమించానని చెప్పి.. మరొకరితో ఎలా నిశ్చితార్థం చేసుకుంటావని కావ్యతో గొడవపడ్డాడు. ఆవేశంతో ఊగిపోతూ వెంట తెచ్చుకున్న కత్తితో కావ్యను పదే పదే పొడిచాడు. కర్కశంగా కత్తితో దాడి చేయడంతో కావ్య తీవ్ర గాయాల పాలైంది. కొంతసేపటికే స్పాట్లోనే చనిపోయింది. అమ్మపేట పోలీసులు కావ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తంజావూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కావ్య తల్లిదండ్రుల ఫిర్యాదుతో అజిత్ కుమార్పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
