దేశంలోని టాప్ ఐటీ సేవల కంపెనీ టీసీఎస్. కానీ దానికి యువత, ఉద్యోగుల్లో ఉన్న ఆదరణ ఇటీవలి కాలంలో మసకబారుతోంది. కంపెనీ లేఆఫ్స్ ప్రకటించిన తర్వాత బలవంతపు రాజీనామాలు చేయించటం వార్తల్లో వినిపించింది. అయితే తాజాగా కంపెనీ తన ఉద్యోగులను తొలగించటానికి కొత్త అస్త్రంతో వచ్చేసింది.
తాజాగా కంపెనీ తన ఉద్యోగులను తొలగించటానికి అంతర్గతంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది. ఇందులో సీనియర్ ఉద్యోగులనే కాకుండా కంపెనీలో చేరి 2 ఏళ్లు కూడా పూర్తి కాని టెక్కీలు కూడా బలైపోతున్నట్లు ఫోరమ్ ఫర్ ఐటీ ఎంప్లాయిస్ పేర్కొంది. వాస్తవానికి ఇలాంటి పరీక్షలు ఉద్యోగుల నైపుణ్యాలను పరిశీలించి వాటిని మెరుగుపరచటానికి వాడాల్సింది పోయి లేఆఫ్స్ చేసేందుకు వాడుకోవటాన్ని తప్పుపట్టింది.
అంతర్గత అసెస్మెంట్ తర్వాత రిజైన్ చేయాలంటా చాలా మంది ఉద్యోగులపై కంపెనీ ఒత్తిడి చేస్తోందని తెలుస్తోంది. ఇలా పరీక్షలు ఉద్యోగుల జీవనోపాధిని దెబ్బతీస్తున్నప్పుడు ఉద్యోగి ఎక్కడ తప్పులు చేస్తున్నాడనే విషయాలు చెప్పాల్సిన బాధ్యత కూడా కంపెనీకి ఉందనే వాదన వినిపిస్తోంది. కంపెనీ 70-80 శాతం మందిని ఉత్తీర్ణులుగా చేస్తూ మిగిలిన వారిని రాజీనామా చేయాలని ఒత్తిడి చేస్తున్నట్లు తేలింది. అయితే దీనిపై వెంటనే మహారాష్ట్ర లేబర్ మంత్రి ఆకాష్ ఫండ్కర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెరుగుతోంది. అసలు టీసీఎస్ లోపల ఏం జరుగుతోందో తెలుసుకోవాలని ఐటీ ఉద్యోగులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
అసలు టెక్నాలజీ రంగం నిలిచిందే వ్యక్తుల టాలెంట్ వల్ల అని అలాంటప్పుడు కంపెనీ దానిని పక్కన పెట్టి ఏఐ కోసం, ఖర్చుల మదింపుల కోసం దారుణంగా లేఆఫ్ చేయటాన్ని ఉద్యోగులు తప్పుపడుతున్నారు. మరికొందరు ఐటీ రంగం కోసం కొత్త లేబర్ చట్టాలను డిమాండ్ చేస్తున్నారు. కంపెనీలు వద్దనుకున్నప్పుడు వెంటనే పంపించేయటం కావాలనుకున్నప్పుడు 3 నెలలు నోటీస్ పిరియడ్ చేయాల్సిందేనని డిమాండ్ చేయటం సరైనది కాదని అంటున్నారు. ప్రధాని రాష్ట్రపతి లాంటి ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా కావాలనుకుంటే ఒక్క రోజులో తమ విధుల నుంచి తప్పుకునే వీలున్నప్పుడు తమకు మాత్రం ఎందుకిలా అంటూ ఐటీ నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
