పిల్లల కిడ్నీల్లోనూ రాళ్లు ఇవే కారణాలంటున్న డాక్టర్లు

పిల్లల కిడ్నీల్లోనూ రాళ్లు ఇవే కారణాలంటున్న డాక్టర్లు
  • తగినంత నీళ్లు తాగకపోవడం, 
  • అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్​ తీసుకోవడం
  • ఆహార‌‌ంలో మార్పులు, ఊబ‌‌కాయం, ప‌‌ర్యావ‌‌ర‌‌ణ సమస్యలూ దోహదం
  • జ‌‌న్యుప‌‌ర‌‌మైన స‌‌మ‌‌స్యలు కారణమే
  • వరంగల్​కు చెందిన 8 ఏండ్ల బాలుడి కిడ్నీలో రాళ్లు

హైద‌‌రాబాద్ సిటీ, వెలుగు: కిడ్నీలో రాళ్ల స‌‌మ‌‌స్య ఇప్పటివరకు పెద్దవారిలోనే కనిపించేది. కానీ, ఇప్పుడు చిన్న పిల్లలనూ వేధిస్తున్నది. పిల్లలు త‌‌గినంత నీళ్లు తాగ‌‌క‌‌పోవ‌‌డం, అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారం తీసుకోవ‌‌డం ముఖ్య కారణాలు కాగా, ఆహార‌‌పు అలవాట్లలో మార్పులు, ఊబ‌‌కాయం, ప‌‌ర్యావ‌‌ర‌‌ణ సమస్యలు కూడా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడడానికి దోహదం చేస్తున్నాయని డాక్టర్లటున్నారు. తాజాగా, వ‌‌రంగ‌‌ల్ ప్రాంతానికి చెందిన ఎనిమిదేళ్ల బాలుడు తీవ్ర మైన కడుపు నొప్పితో బాధపడుతుండడంతో హైదరాబాద్​లోని ఏషియ‌‌న్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాల‌‌జీ అండ్ యూరాల‌‌జీ దవాఖానకు తీసుకువచ్చారు. డాక్టర్లు స్కాన్​చేసి చూడగా ఎడ‌‌మ‌‌ వైపు కిడ్నీలో రాళ్ల గుంపు కనిపించింది. దీంతో సర్జరీ చేసి వాటిని తొలగించారు.

నవజాత శిశువుల్లోనూ..

చిన్నపిల్లల్లోనే కాకుండా న‌‌వ‌‌జాత శిశువుల కిడ్నీల్లోనూ రాళ్లు కనిపిస్తున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. మ‌‌రీ చిన్నపిల్లల్లో అయితే మెట‌‌బాలిక్ కార‌‌ణాల వ‌‌ల్ల రాళ్లు ఏర్పడుతున్నాయి. క్రానిక్ కిడ్నీ డిసీజ్ కేసులు తెలంగాణ‌‌లో 6.2 శాతం ఉండగా, గత 15–--20 ఏండ్లలో పిల్లల కిడ్నీల్లో రాళ్ల స‌‌మ‌‌స్య నాలుగు రెట్లు పెరిగింది. కొన్ని కేసుల్లో జ‌‌న్యుప‌‌ర‌‌మైన స‌‌మ‌‌స్యల వ‌‌ల్ల కూడా రాళ్లు ఏర్పడుతున్నాయని డాక్టర్లు గుర్తించారు. 

నీళ్లు తాగక మూత్రం చిక్కబడి రాళ్లు 

ఆహారంలో ఉప్పు వాడ‌‌కం, తీపి పానీయాలు త‌‌గ్గించాని డాక్టర్లు చెప్తున్నారు. ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నదని, ఎన్ని లీటర్లు తాగాం అనేదానికంటే.. ఎంత మూత్రం వస్తుందనేది ముఖ్యమన్నారు. రోజుకు క‌‌నీసం లీటరున్నర మూత్రం పోయేలా నీళ్లు తాగాలంటున్నారు. అలా తాగ‌‌క‌‌పోతే మూత్రం చిక్కబడుతుందని, అదే కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి 
కారణమవుతుందంటున్నారు. .

ఆశ్చర్యపోయా.. 

వరంగల్​ బాలుడు తీవ్రమైన కిడ్నీ సమస్యతో రావడంతో టెస్టులు చేయగా, కిడ్నీలో రాళ్ల గుంపు కనిపించింది. అది చూసి  ఆశ్చర్యపోయాం. ఒక పెద్దరాయి, మ‌‌రికొన్ని చిన్నరాళ్లు అన్నింటినీ ఒకే సిట్టింగ్​లో తొలగించాం. సాధారణంగా వీటికి 2-3 సిట్టింగ్స్​అవసరం అవుతాయి. కానీ, వీపు భాగంలో చిన్న రంధ్రం చేసి, నెఫ్రోస్కోప్ ద్వారా కిడ్నీలోకి వెళ్లి ఎక్కువ నొప్పి లేకుండా తొల‌‌గించాం. సంప్రదాయ సర్జరీల కంటే ఈ పద్ధతిలో త్వరగా కోలుకుంటారు.  ఈ మధ్య ఈ తరహా కేసులు పెరుగుతున్నాయి. – డా. అశ్విన్ శేఖ‌‌ర్, కన్సల్టెంట్​పీడియాట్రిక్, ట్రాన్సిష‌‌న‌‌ల్ యూరాల‌‌జిస్ట్