- హైకోర్టు ఆవరణలో రాజ్యాంగ దినోత్సవం
హైదరాబాద్, వెలుగు: రాజ్యాంగంలోని సూత్రాలను ప్రతి భారతీయుడు తెలుసుకోవాలని, ఇవి యువత మనస్సుల్లో నాటుకునేలా చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, విద్యావేత్తలు, ప్రభుత్వ సంస్థలు, పౌర సమాజంపై ఉందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. యువత రాజ్యాంగం గురించి సృజనాత్మకంగా, అనుభవపూర్వకంగా తెలుసుకునే మార్గాలను వివరించారు. బుధవారం 76వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర హైకోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్ ముఖ్యఅతిథిగా పాల్గొని, ప్రసంగించారు.
రాజ్యాంగం చట్టబద్ధమైన పత్రం కాదని, ఇది ప్రజాస్వామ్యానికి జీవనాడి వంటిదన్నారు. ఏడు దశాబ్దాలకుపైగా భిన్నత్వంలో ఏకత్వం అనే స్ఫూర్తిని నింపుతూ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలబెట్టగలిగిందని పేర్కొన్నారు. రాజ్యాంగంలో పేర్కొన్న జవాబుదారీతనం, పారదర్శకత బాధ్యతాయుతమైన పాలనను అందిస్తుందన్నారు. రాజ్యాంగం ద్వారానే తెలంగాణ ఏర్పాటైందని, ఇది ప్రాంతీయ వైవిధ్యాన్ని అందించిందని చెప్పారు.
రాజ్యాంగం ప్రతి ఇంటికి చేరాలి: జస్టిస్ అపరేశ్ కుమార్
రాజ్యాంగ స్ఫూర్తి కేవలం సంస్థలు, కోర్టు గదులకే పరిమితం కాకూడదని, ప్రతి ఇల్లు, ప్రతి వ్యక్తికి చేరాల్సిన అవసరం ఉందని చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ అన్నారు. రాజ్యాంగం హక్కులతో పాటు బాధ్యత, జవాబుదారీతనం ఇస్తుందని చేస్తుందని చెప్పారు. రాజ్యాంగ రక్షణ బాధ్యత కేవలం న్యాయ, శాసన, కార్యనిర్వహక వ్యవస్థలదే కాదని, రాజ్యాంగ విలువలు నేర్పే విద్యావేత్తలు, అమలు చేసే నిర్వాహకులు, ప్రజల్లో అవగాహన పెంచే మీడియా, హక్కులను తెలిపే పౌర సమాజం, కుటుంబంపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి, బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎ.జగన్, న్యాయమూర్తులు తదితరులు పాల్గొన్నారు.
