తీవ్రమైన ఆవేదనతో, పూర్తి స్పష్టతతో చెబుతున్నాను. మనస్ఫూర్తిగా నేను కాంగ్రెస్ కార్యకర్తను. కులవాదిని కాదు. నేను నా కులానికి సంబంధించి, లేదా మరే ఇతర కులానికి సంబంధించి ఇంతకు ముందెన్నడూ బహిరంగంగా ఏమీ మాట్లాడలేదు. అయినప్పటికీ, తెలంగాణలో ఇటీవల ప్రకటించిన డీసీసీ అధ్యక్షుల నియామకం జాబితాలో 36 నియామకాలలో వెలమ సమాజానికి అసలు ప్రాతినిధ్యమే లేదు, వెలమ సమాజం అనాథగా మిగిలిపోయింది.
కాంగ్రెస్ పార్టీ ప్రతిరోజూ గర్వంగా ప్రచారంచేసే సామాజిక న్యాయం స్ఫూర్తిని ఇది ప్రతిబింబించడం లేదని చెప్పగలం. వెలమలు దేశానికి, కాంగ్రెస్ పార్టీకి అపూర్వమైన నిబద్ధతతో సేవ చేశారు. ముఖ్యమంత్రులు, ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో రెండుసార్లు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా, ప్రత్యేక తెలంగాణలో కూడా ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. ప్రతి మంత్రివర్గంలో సీనియర్ మంత్రులుగా పనిచేశారు. ఎల్లప్పుడూ నిజాయితీకి, త్యాగానికి మారుపేరుగా నిలిచారు.
ప్రజాసేవకు ప్రతీకగా వెలమ సమాజం వెలమలు ప్రజాసేవకు ప్రతీకగా నిలిచారు.
నిస్వార్థంగా సమాజానికి సేవ చేశారు. నేటికీ సజీవంగా ఉన్న వారి సేవ, దానాలకు ఉదాహరణలు.. బొబ్బిలి సంస్థానం, నూజివీడు సంస్థానం. తమ వ్యక్తిగత సంపదతో పాఠశాలలు, కళాశాలలు, దేవాలయాలు, ప్రజా సంస్థలను నిర్మించారు. రాచకొండ, దేవరకొండ (రేచర్ల) , జెట్‌ప్రోల్ (కొల్లాపూర్) కుటుంబాలు దాతృత్వానికి ప్రసిద్ధి చెందాయి.
రామప్ప చెరువు, ఆలయం రుద్రదేవుడు నిర్మించారు, అలాగే అన్నవరం ఆలయానికి భూమిని దానం చేసి, ఆలయాన్ని నిర్మించారు. కరీంనగర్‌లో ప్రసిద్ధి చెందిన కొండగట్టు ఆలయ దాతలు దివంగత ముత్యంపేట లక్ష్మీ నరసింహారావు కుటుంబం. జగిత్యాలలో వేల కోట్ల విలువైన ప్రధాన భూమిని కళాశాల స్థాపన అభివృద్ధికి దానం చేశారు. ఎం.ఎస్.ఆర్. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు ఆయన ముంబై సీఫేస్‌లో తనకు ఇవ్వజూపిన భారీ భూ బహుమతిని నిరాకరించి, దానిని పాఠశాల కోసం దానం చేయాలని పట్టుబట్టారు. ప్రచారం లేకుండా తరతరాలుగా కొనసాగిన ఈ నిస్వార్థ సేవలో ఎక్కువ మంది కాంగ్రెస్‌తో అనుబంధం కలిగి ఉండటం యాదృచ్ఛికం కాదు.
వెలమ నాయకత్వం ద్వారా కాంగ్రెస్ వృద్ధి..వెంగళరావు, జేవీ. నరసింగరావు,
చొక్కారావు, కేవీపీ వీరంతా నిరాడంబరత, నిజాయితీతో జీవించారు. కేవీపీ 2004, 2009 కాంగ్రెస్ విజయాలలో కీలక పాత్ర పోషించారు. క్షేత్రస్థాయి వాస్తవాలు తెలిసిన ఎవరైనా ఈ విషయాన్ని కొట్టిపారేయలేరు. ఎం.ఎస్.ఆర్, వెంగళరావు పీసీసీ అధ్యక్షులుగా సంక్షోభం నుంచి పార్టీని పునరుద్ధరించి, ప్రతికూల పరిస్థితుల్లో కూడా పదేపదే తిరిగి పుంజుకునేలా చేశారు. ఎన్.టి.ఆర్. ప్రభావిత కాలంలోనూ మెజారిటీ వెలమలు కాంగ్రెస్‌కు అండగా నిలిచారు.
అధికారం నుంచి దూరంగా ఉన్నా, పదవులు ఆఫర్ చేసినా, కాంగ్రెస్ పట్ల తమ నిబద్ధతను, ప్రాధాన్యతను చూపి పార్టీ పునర్నిర్మాణానికి సహాయం చేశారు.
ఇటీవలి తెలంగాణ ఎన్నికల్లో కూడా వెలమలు కాంగ్రెస్‌కు గట్టిగా వెన్నుదన్నుగా నిలిచారు. 9 ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే 6 మంది గెలిచారు. గతంలో ఉన్న 33 డీసీసీ అధ్యక్షులలో 5 మంది వెలమలే. నాలాంటి నాయకులు చాలామంది ధైర్యంగా పోరాడారు, సొంత వనరులను ఖర్చు చేశారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ జెండాను ఎగురవేశారు, రిస్క్‌లు, బెదిరింపులు ఎదుర్కొన్నారు.
జీరో ప్రాతినిధ్యం ఎందుకు?
42% బీసీ రిజర్వేషన్లు. బీసీ కులగణన, ప్రతి కాంగ్రెస్ కార్యక్రమానికి సంకోచం లేకుండా రేవంత్ రెడ్డి నాయకత్వం, కాంగ్రెస్ హైకమాండ్‌కు మద్దతుగా అత్యంత చిత్తశుద్ధితో పనిచేశాం.
మరి ఇప్పుడు జీరో ప్రాతినిధ్యం ఎందుకు? మమ్మల్ని మాత్రమే ఎందుకు పక్కనపెట్టారు? సామర్థ్యం, సంస్థాగత బలం లేనివాళ్లమా? అన్ని వర్గాల ప్రజలచే విశ్వసించని వాళ్లమా? మంచి, చెడు, అత్యంత దారుణమైన దశలలో కాంగ్రెస్ పట్ల విశ్వసనీయత లేని వాళ్లమా? పార్టీ కోసం కుటుంబాలకు వ్యాపారాలకు దూరమై, వ్యక్తిగతంగా సమయాన్ని, డబ్బును త్యాగం చేశాం. కుటుంబానికి దూరంగా పనిచేసిన చిత్తశుద్ధి గల సైనికులం.
బహిరంగంగా మీడియాలో సామాజిక న్యాయాన్ని సమర్థించే వాళ్లం. మన పార్టీ సామాజిక న్యాయాన్ని బలపరుస్తున్నప్పుడు, కాంగ్రెస్‌కు నిస్సందేహంగా అండగా నిలబడిన ఒక సామాజిక వర్గానికి పూర్తిగా సున్నా ప్రాతినిధ్యం ఇవ్వడం న్యాయమేనా? ఇది పదవుల గురించిన విషయం కాదు. కాంగ్రెస్ పార్టీలోని నా తోటి వెలమ నాయకులకు ఎటువంటి పదవులు ఇవ్వకపోయినా మేం గౌరవంగా జీవించగలం. కానీ, న్యాయం, గౌరవం, మా సమాజం చేసిన కృషికి మర్యాద గురించి ఆవేదన వ్యక్తం చేస్తున్నాం.
కాంగ్రెస్, వెలమల మధ్య భవిష్యత్తు విశ్వాసం కోసం..
ఎప్పుడైనా పర్యవేక్షణ లోపం జరిగినప్పుడు, పార్టీ, నాయకత్వం ఎల్లప్పుడూ తమ మార్గాన్ని సరిదిద్దుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. వెలమ సమాజం పట్ల ఈ నిర్లక్ష్యాన్ని పునఃపరిశీలించి, సామాజిక న్యాయం స్ఫూర్తికి అనుగుణంగా సరైన న్యాయం చేయాలని నేను వ్యక్తిగతంగా పార్టీలో ఉన్నా నా ఇతర సహచరులు భావించారు - ఈ రోజు మేం బాధతో ఉన్నాం. కానీ, కాంగ్రెస్ పార్టీకి ఎల్లప్పుడూ పునాదిగా నిలబడిన వెలమలకు పార్టీ న్యాయం చేస్తుందనే నమ్మకంతో ఉన్నాం.
- వెలిచాల రాజేందర్ రావు,కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటరీ ఇన్‌చార్జ్
