రైజింగ్ తెలంగాణలో..ప్రజా గ్రంథాలయం ఆవశ్యకత

రైజింగ్ తెలంగాణలో..ప్రజా గ్రంథాలయం ఆవశ్యకత

జ్ఞానాన్ని ప్రజాస్వామ్యీకరించడం బుద్ధుడు చెప్పినట్లు అత్యవసరం. పుస్తక సంపద, గ్రంథాలయాలు గ్రామీణ స్థాయి నుంచి పట్టణస్థాయి వరకు ప్రతి పౌరునికి సమానంగా అందుబాటులో ఉండాలి. ప్రస్తుతం జ్ఞానం కొందరి చేతుల్లో నిక్షిప్తమై ఉండటం ఆర్థిక, సాంఘిక అసమానతలకు దారితీసింది. అయితే, జ్ఞానం అందరి చేతుల్లో ఉంటే ఈ అసమానతలన్నింటినీ రూపుమాపవచ్చు. ఈ రైజింగ్ జ్ఞాన తెలంగాణ ఆవిర్భావానికి ఒక బలమైన తెలంగాణ ప్రజా గ్రంథాలయం (టీపీఎల్) అవసరం ఎంతైనా ఉంది. సంకల్పం, సాంస్కృతిక స్ఫూర్తి, ప్రజాశక్తి ఈ మూడూ ఒకే వేదికపై మిళితమై టీపీఎల్ ఏర్పాటుకు నాంది పలకాలి.

ఇటీవల ఆగస్టు 25న ఉస్మానియా విశ్వవి ద్యాలయాన్ని సందర్శించిన సందర్భంగా  సీఎం రేవంత్​రెడ్డి విద్యార్థులతో మాట్లాడుతూ విద్య బలంపై తన ఆలోచనలను పంచుకున్నారు.  విద్యే మనలను విజ్ఞానవంతులుగా, ధనికులుగా, ఉత్తమ పౌరులుగా తయారు చేస్తుంది. మనల్ని కలవరపెడుతున్న లేదా హాని చేస్తున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా నిర్భయంగా పోరాడాలని ఆయన  పిలుపునిచ్చారు.  ఇది ఆధ్యాత్మిక మేధావి, మాజీ ఆంగ్ల  ప్రొఫెసర్ డా. ఎం. శివరామకృష్ణ మాటలను ప్రతిధ్వనిస్తున్నది. ప్రస్తుతం, నిర్లక్ష్యం వల్ల పబ్లిక్ లైబ్రరీ వ్యవస్థ (గ్రంథాలయ సెస్​ను అందించడంలో వైఫల్యం) తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 

సాహిత్యం, సాంస్కృతిక, సామాజిక విలువలు

 సాహిత్యాన్ని నిర్లక్ష్యం చేసిన సమాజంలో నైతిక విలువలు నశిస్తాయి.  హరిత సమాజానికి, జ్ఞాన సమాజానికి తటస్థ సంస్థ అవసరం. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గద్దర్,  గోరటి వెంకన్న, విమలక్క,  అందె శ్రీ వంటి ప్రజాకవుల సాహిత్య వారసత్వాన్ని శాశ్వతంగా సంరక్షించాలి.  

వారి ప్రచురిత, అప్రచురిత రచనలు, మెటీరియల్స్, మాన్యుస్క్రిప్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు వంటి చారిత్రక ఆధారాలు భవిష్యత్ తరాలకు అందించడం మన బాధ్యత.  అందె శ్రీ 'మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు' అనే పాట ద్వారా మానవత్వం నశించడాన్ని వివరించగా,  శ్రీరాం సార్ 'హసితభాష్పాలు' రూపంలో భావోద్వేగ చిత్రాలతో మానవత్వ రూపాన్ని ఆవిష్కరించారు. 

ఇలాంటి సమర్థుల, మేధావుల విద్య, ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని తెలంగాణ ప్రజా గ్రంథాలయం భద్రపర్చగలదు.   తెలంగాణ ప్రజా గ్రంథాలయం కోసం తెలుగు విశ్వవిద్యాలయం క్యాంపస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను జ్ఞానసౌధంగా డిజైన్ చేయవచ్చు. లేదా  తెలంగాణ హైకోర్టు అఫ్జల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గంజ్ నుంచి రంగారెడ్డికి మారుతున్నందున ఆ స్థలాన్ని తెలంగాణలో ప్రజా గ్రంథాలయానికి కేటాయించవచ్చు.  

ఇది తాత్కాలికంగా ఉస్మానియా క్యాంపస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సొంత భవనం ఏర్పడేవరకు నిలయం కావచ్చు. అంతిమంగా ఉస్మానియా క్యాంపస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 10 అంతస్తుల హరిత భవనం నిర్మించడం ఉత్తమం.

 తెలంగాణ చరిత్ర మూలాలు

 తెలంగాణ ఉద్యమం నుంచి ఉద్భవించిన మూల సాహిత్యాన్ని, నిష్పాక్షిక రాజకీయ ఒత్తిళ్ళు లేకుండా, శాస్త్రీయంగా, ఆధారంగా రచించే అవకాశం  పబ్లిక్ లైబ్రరీ వ్యవస్థ​ కల్పిస్తుంది. పుస్తకాలు, పత్రికలు, పోస్టర్లు, పాటలు, వీడియోలు, ఫొటోలు ఇవన్నీ ఆయా తరం చరిత్రను వివరించే ముఖ్యమైన హస్తప్రతులుగా భద్రపరచాలి.  

తెలంగాణ మాటల నిఘంటువులు,  తెలంగాణ మాండలికంతో కూడిన కంప్యూటరైజ్డ్ భాషా నిఘంటువు విభాగానికి సంపూర్ణ సౌలభ్యం కల్పించడం. విశేష నిపుణులు, పరిశోధకులు కలిసి పనిచేయడానికి,  సాంఘిక-, సాంస్కృతిక అభివృద్ధిని పెంపొందించడానికి టీపీఎల్ వేదిక కల్పించాలి. 

స్కిల్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లో భాగంగా అత్యాధునిక ఐటీ వ్యవస్థతో అనుసంధానమైన కమ్యూనిటీ సమాచారం, డాక్యుమెంట్ డిజిటలైజేషన్, పుస్తక సంరక్షణ, నిర్మాణం, ఇలా అనేక ఉపాధి ఆధారిత కోర్సులను అందించాలి. పుస్తకాలు సేకరించేందుకు రెండు/మూడు బుక్  అంబులెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను నిర్వహించాలి. 

దాతల నుంచి పుస్తకాలను సేకరించడం,  బుక్ మరమ్మతు సేవలను అందించడం, భారీ ఫుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫాల్ ఉన్న స్థలాల్లో  అంబులెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను నిలిపి ఈ సేవలు అందించాలి. తెలంగాణ ప్రభుత్వం హ్యూమానిటీస్, సోషల్ సైన్స్ గ్రంథాలయాలను కూడా ప్రోత్సహించాలి.

లైబ్రరీ సెస్ బకాయిలు చెల్లించాలి

జీహెచ్​ఎంసీ  ద్వారా ప్రతి రూపాయిలో 8 పైసలు లైబ్రరీ సెస్ వసూలు అవుతోంది. 2024-–25 ఆర్థిక సంవత్సరంలో రూ. 2038.421 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  రూ. 163 కోట్ల లైబ్రరీ సెస్ ఉంది.  గత కొంతకాలంగా ప్రభుత్వాలు దాదాపు రూ. 1500 కోట్ల సెస్ బకాయిలను గ్రంథాలయాలకు అందించడంలో నిర్లక్ష్యం చేశాయి. 

ముఖ్యమంత్రి ఈ బకాయిలను పరిశీలించి, డెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు సెట్ చేయాలి.  ఈ నిర్ణయం ద్వారా తెలంగాణ పబ్లిక్ లైబ్రరీలను పునర్జీవింప చేయటానికి వీలవుతుంది.  తెలంగాణ ప్రజా గ్రంథాలయం  ప్రధాన సంస్కరణలకు కేంద్రంగా మారాలి.  ప్రపంచ స్థాయి తెలుగు సాహిత్య-జ్ఞాన కేంద్రంగా తెలంగాణ ప్రజా గ్రంథాలయం పనిచేస్తుంది.  

తెలంగాణలో ప్రజా గ్రంథాలయంలో ప్రతిపాదిత విభాగాలను ఏర్పాటు చేయాలి. అవి పరిపాలనా & సాంకేతిక సహాయం,   ప్రజా గ్రంథాలయాలకు కేంద్ర ప్రయోగశాల ఏర్పాటు,  వారసత్వ గ్రంథాలయాల కలెక్షన్లు, ప్రజా ప్రముఖులు/ పండితులు/ పుస్తక ప్రియుల వ్యక్తిగత గ్రంథాలయాల జ్ఞాన భాండాగారం,  తెలుగు పుస్తకాలు ప్రపంచ కావ్య భాండాగారం,  తెలుగు పత్రికలు, దినపత్రికలు ప్రపంచ భాండాగారం,  అంశ నిపుణులు, పరిశోధక విద్యార్థులకు వాచన మందిరం,  తెలంగాణ అమరవీరుల స్మారక పాఠశాలలు,  రచ్చబండ – సమావేశ వేదిక,  జ్ఞానదాన్ – పుస్తకాల ప్రతులు రాష్ట్ర కేంద్ర కావ్య భాండాగారం ఏర్పాటు చేయాలి.  తెలంగాణ  ప్రభుత్వం తన  తెలంగాణ ప్రజా గ్రంథాలయం (టీపీఎల్) ప్రణాళికను పటిష్టంగా  రూపొందించాలి.

- డా. రవికుమార్ చేగొని,ప్రధాన కార్యదర్శి, తెలంగాణ గ్రంథాలయ సంఘం