చెరువుల సంరక్షణతో.. గ్రామవికాసం!

చెరువుల సంరక్షణతో.. గ్రామవికాసం!

భారతదేశంలో చెరువులు కేవలం నీటి వనరులే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు, మానవ మనుగడకు, సంస్కృతి పరిరక్షణకు పట్టుగొమ్మలు. ఇవి నీటినిల్వకు మాత్రమే కాకుండా వరదల ప్రభావం తగ్గించడానికి, పర్యావరణ సమతౌల్యానికి, భూగర్భ జలాల సంరక్షణకు అత్యంత కీలకమైనవి. 

ఆధునిక భారతంలో  పెద్దపెద్ద ఆనకట్టలు, రిజర్వాయర్ల నిర్మాణం జరగకముందు  చెరువులే  ప్రధానంగా సాగు, తాగునీటి వనరులుగా ఉండేవి.  పెద్ద మంచినీటి సరస్సులు లేదా నదీ వ్యవస్థల కంటే  చెరువులు ఎక్కువ  జీవవైవిధ్యాన్ని కలిగి ఉండేవి.  మొక్కలు, ఉభయచరాలు, చేపలు, సరీసృపాలు, నీటి పక్షులు, కీటకాలు, కొన్ని క్షీరదాలతో సహా అనేకరకాల జీవులకు  చెరువులు ఆవాసాలు. కాల క్రమేణా పట్టణీకరణ, ఆధునిక జీవనశైలి, నిర్వహణలో నిర్లక్ష్యం, ఆక్రమణలతో  చెరువులు  ప్రాభవాన్ని కోల్పోయి ఎనలేని నష్టం వాటిల్లుతోంది.

ఈ  ఏడాది  నైరుతీ రుతుపవనాలు, అల్ప పీడనాలతో కురిసిన వర్షాలు,  ఎగువ నుంచి వస్తున్న వరదల వలన ప్రధాన జలాశయాలన్నీ నిండి కళకళలాడుతున్నాయి.  తెలంగాణలో మొత్తం 1,069.30 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంలో  883.71 (82.64%) టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి.  

అయితే ఇదే పరిస్థితి  చిన్న నీటి వనరులలో కనిపించడం లేదు.  తెలంగాణ ఇరిగేషన్  డెసిషన్ సపోర్ట్ సిస్టం (టీఐడీఎస్ ఎస్​)ను  అనుసరించి రాష్ట్రంలోని  253.80 టిఎంసిల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన 34,701 చెరువులలో 123 టీఎంసీ (48శాతం)లు మాత్రమే నీటి  నిల్వలు ఉన్నాయి.  

తెలంగాణలో  సుమారు పదివేల చెరువులు  నిరుపయోగంగా ఉన్నాయి. ఒకవైపు భారీ, మధ్య తరహా ప్రాజెక్టులు నిండి ఎగువ నుంచి  వస్తున్న వరదనీటిని సముద్రంలోకి వదిలేస్తుంటే, మరోవైపు  చెరువులు పూర్తిగా నిండని పరిస్థితి.  చెరువులన్నీ వాడుకలో ఉంటే విస్తారంగా కురిసిన వర్షపునీటిని నింపుకుని వరదలకు కొంతమేర అడ్డుకట్ట వేయడానికి అవకాశం ఉంటుంది. అదే సమయంలో భూగర్భ జలాలు పెరిగి వేసవిలో నీటి ఎద్దడిని నివారించడం సాధ్యమవుతుంది.  

ఆక్రమణలతో అపార నష్టం

నగరాలు, పట్టణాలు, పల్లెలు తేడా లేకుండా ఆక్రమణదారులు చెరువుల్ని మింగేస్తున్న ఫలితంగా వేలాది జలవనరులు కనుమరుగవుతున్నాయి. చెరువుల సమీపంలో అక్రమ నిర్మాణాల వలన సహజ నీటి ప్రవాహ మార్గాలు నాశనమై చెరువులు ఆనవాళ్లు కోల్పోవడమో లేదా ఆక్రమణకు గురి కావడమో జరుగుతున్నది.

  గ్రేటర్  హైదరాబాద్ పరిధిలో  చెరువుల ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీఎల్, బఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జోన్లు  ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన ఫలితంగా దాదాపు 600 చెరువులు ఆక్రమణలకు  గురయ్యాయి.  దీనివలన వర్షాకాలంలో వరద నీరు చెరువుల్లోకి మళ్లే మార్గం లేక జనావాసాలను ముంచెత్తడం వలన తరచుగా అపారమైన ఆస్తి,  ప్రాణనష్టం సంభవిస్తోంది.  

కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ నిర్వహించిన ‘ఇరిగేషన్ సెన్సస్' నివేదిక ప్రకారం  దేశవ్యాప్తంగా 38,496 చెరువులు, సరస్సులు తదితర చిన్న నీటి వనరులు ఆక్రమణకు గురికాగా, దాదాపు 14,535 చోట్ల ప్రమాదంలో ఉన్నాయి. 3,032 చిన్న నీటి వనరులు ఆక్రమణలతో  తెలంగాణ అత్యధికంగా ఆక్రమణలకు గురైన మొదటి ఐదు రాష్ట్రాల జాబితాలో ఉన్నట్లు సదరు నివేదిక వెల్లడించింది.

నీటివనరులపై  ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి

 శిథిలావస్థకు చేరుకున్న అనేక చెరువులు తదితర అదనపు నీటి వనరుల సదుపాయాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి తిరిగి వాడుకలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది.  తమిళనాడు ప్రభుత్వ తరహాలో జలాశయాలు, చెరువులు, ఇతర నీటి వనరులను జలవనరులశాఖ, రెవెన్యూ, స్థానిక సంస్థలతోపాటు, కాలుష్య నియంత్రణ మండలి,  ఐటీ శాఖల సహాయంతో,  ఉపగ్రహ సాంకేతికత సాయంతో మ్యాపింగ్ చేసి సరిహద్దులు నిర్ణయించాలి.  

ఒకసారి హద్దులు నిర్ణయించి ఆమోదం పొందాక, ఆ పరిసరాల్లో ఎవరు ఆక్రమణలకు ప్రయత్నించినా,  హద్దుల్లో తేడా వచ్చినా ఉపగ్రహ సాంకేతికత, ఇతర సెన్సర్లు వెంటనే వివిధ శాఖలను అప్రమత్తం చేసేలా ప్రత్యేక వ్యవస్థను రూపొందించాలి.  ఇలా ఏఐ సాంకేతికతను ఉపయోగించుకుని జలాశయాలను పరిరక్షించుకోవడమే కాకుండా జల వనరులు కలుషితం కాకుండా కూడా జాగ్రత్తలు 
తీసుకోవచ్చు.

గ్రామీణాభివృద్ధిలో చెరువులు కీలకం

చెరువుల్లోకి వర్షాకాలంలో నీటితోపాటు చేరుతున్న బురదను ఎప్పటికప్పుడు తొలగించడం ద్వారా నీటి నిల్వ సామర్ధ్యం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.  పూడిక తీయడం  ద్వారా వచ్చిన బురద మట్టిని పొలాల్లో ఉపయోగిస్తే నేల సారవంతంగా మారుతుంది.  చెరువుల వలన నీటి లభ్యతతోపాటు పరిసర ప్రాంతాల్లో  తక్కువ లోతుల్లోనే భూగర్భ జలాలు లభ్యమౌతాయి.  

నాలుగు వైపులా కట్టలను పటిష్ట పరచడం, కట్టపై కొబ్బరి మొక్కలు నాటడం, నడక మార్గం,  సోలార్ లైట్లు,  నక్షత్ర వనం, పిల్లల పార్కు,  ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం ద్వారా వర్షపునీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు జరుగుతుంది.  ప్రజలకు ఆహ్లాదంగా ఉండేలా చెరువును తీర్చిదిద్దాలనే లక్ష్యంతో అభివృద్ధి చేయాలి.   తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చెరువులను అభివృద్ధి చేసి వాటి నిర్వహణను గ్రామ పంచాయతీలకు అప్పగించాలి.  

వాటిలో చేపల పెంపకం, కొబ్బరి చెట్ల ద్వారా వచ్చే ఆదాయంతో గ్రామ పంచాయతీలు సమర్థవంతంగా చెరువుల  నిర్వహణను చేపట్టవచ్చు. రాష్ట్రంలోని అన్ని చెరువులను ఇదేవిధంగా ప్రభుత్వం అభివృద్ధి చేస్తే ఎనలేని మేలు చేకూరుతుంది.  గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ, నీటి అవసరాలు తీరి పల్లెలు కరువు రహితంగా మారాలంటే  సాంప్రదాయక నీటి వనరులైన చెరువుల సామర్థ్యాన్ని  మెరుగుపరచాలి.

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- లింగమనేని శివరామ ప్రసాద్, సోషల్​ ఎనలిస్ట్​