ప్రోటోకాల్ పాటించని ఆఫీసర్లపై కంప్లయింట్ చేస్తాం.. పెద్దపల్లి కాంగ్రెస్ సీనియర్ లీడర్లు ఆగ్రహం

ప్రోటోకాల్ పాటించని ఆఫీసర్లపై కంప్లయింట్ చేస్తాం.. పెద్దపల్లి కాంగ్రెస్ సీనియర్ లీడర్లు ఆగ్రహం
  • ఎవరో దయతలిస్తే గడ్డం వంశీకృష్ణ ఎంపీ కాలేదు

​పెద్దపల్లి, వెలుగు: దళిత ఎంపీ గడ్డం వంశీకృష్ణపై అధికారులు వివక్ష చూపిస్తూ ప్రొటోకాల్​పాటించడం లేదని, బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి కాంగ్రెస్​సీనియర్​లీడర్లు డిమాండ్​చేశారు. పెద్దపల్లి టౌన్ ప్రెస్ క్లబ్ లో వారు బుధవారం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. అభివృద్ధి కృషి చేస్తోన్న ఎంపీ వంశీకృష్ణ ప్రోత్సహించాల్సిన పార్టీ నేతలు, అధికారులు ఎందుకు దూరం పెడుతున్నారని ప్రశ్నించారు. 

పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలు ఓట్లు వేస్తే గెలిచారని, ఎవరో దయ తలిస్తే గెలవలేదని పేర్కొన్నారు. ఎంపీ విషయంలో పదే పదే అధికారులు ప్రోటోకాల్ ఎందుకు విస్మరిస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది పునరావృతమైతే  ఆందోళన చేపడతామన్నారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు తమ ప్రవర్తన తీరు మార్చుకోవాలన్నారు. 

ఇదే పరిస్థితి కొనసాగితే  చీఫ్ సెక్రటరీ, పార్లమెంటు స్పీకర్ కి, ఎస్సీ కమిషన్​కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నేతలు భూషనవేన రమేష్ గౌడ్, బొంకూరి కైలాసం, బాలసాని సతీశ్, కుక్క చంద్రమౌళి, అల్లం సతీశ్ తదితరులు పాల్గొన్నారు. 

ఐఎన్టీయూసీ లీడర్ల ఆగ్రహం 

జ్యోతినగర్: ఎంపీ వంశీ కృష్ణ పట్ల అధికారులు ప్రోటోకాల్ పాటించకపోవడంతో కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ జాతీయ నేత బాబర్ సలీమ్ పాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీపీసీఈ టీటీఎస్ లోని మజ్దూర్ యూనియన్ ఆఫీసులో ఆయన మాట్లాడారు. 

దళిత ఎంపీ పట్ల వివక్ష చూపే అధికారులపై వెంటనే చర్యలు తీసుకునేందుకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ దృష్టి సారించాలని కోరారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు తీసుకునే నిర్ణయాలతో కాంగ్రెస్ కు నష్టం కలుగుతుందని చెప్పారు. ఐఎన్టీయూసీ నేతలు ఆరేపల్లి రాజేశ్వర్, భూమళ్ల చందర్, రాచకొండ కోటేశ్వర్లు, జావెద్ తదితరులు ఉన్నారు.