సింగరేణిలో సోలార్ స్పీడ్.. ఇప్పటికే 245.5 మెగావాట్లతో విద్యుత్ ఉత్పత్తి

సింగరేణిలో సోలార్ స్పీడ్.. ఇప్పటికే 245.5 మెగావాట్లతో విద్యుత్ ఉత్పత్తి
  • సోలార్ ​ప్లాంట్లతో  రూ. 225 కోట్ల ఆదాయం 
  • మరో 30 మెగావాట్ల ప్లాంట్లకు సన్నాహాలు 
  • భూపాలపల్లి, ఇల్లందు, రామగుండంలో ఏర్పాటు

జయశంకర్​భూపాలపల్లి, వెలుగు : సోలార్​విద్యుదుత్పత్తి ప్లాంట్ల నిర్మాణంలో సింగరేణి స్పీడ్ పెంచింది. భూపాలపల్లి ఏరియాలో ఇప్పటికే 10 మెగావాట్ల సోలార్​ప్లాంట్ ను  ఏర్పాటు చేయగా నాలుగేండ్లుగా విజయవంతంగా రన్​అవుతోంది.  

మరో 10 మెగావాట్ల ప్లాంట్ తో పాటు ఇల్లందు, రామగుండంలో కూడా ప్లాంట్ల ఏర్పాటుకు సింగరేణి చర్యలు తీసుకుంటోంది. పర్యావరణ రహిత చర్యల్లో భాగంగా 2020లో సోలార్​ విద్యుత్​ప్లాంట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. 

సింగరేణివ్యాప్తంగా ఖాళీగా ఉన్న వందల ఎకరాల భూములను అన్యాక్రాంతం కాకుండా రక్షించడంతో పాటు సోలార్​ప్లాంట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. ఇప్పటికే 245.5 మెగావాట్లతో సోలార్​ప్లాంట్లను ప్రారంభించింది.  

సోలార్​ ప్లాంట్లతో లాభాలు 

బొగ్గు నిల్వలు తగ్గుతుండగా సింగరేణి ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా సోలార్​ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది.  ఎక్కడా ఖాళీ జాగా లేకుండా సోలార్​ప్లాంట్లను వేగంగా చేపడుతోంది. భూపాలపల్లి జిల్లా బాంబుల గడ్డ సమీపంలో 2021లో 45 ఎకరాల్లో 10 మెగావాట్ల ప్లాంటును నిర్మించగా.. నాలుగేండ్లలో 70 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసింది. 

భూపాలపల్లి ఏరియా పరిధిలో బొగ్గు గని కార్మికుల కాలనీలకు ఎన్​పీడీసీఎల్​నుంచి 72 లక్షల యూనిట్స్ విద్యుత్​ వినియోగిస్తోంది. కరెంట్ బిల్లుల కింద సింగరేణికి రూ. 5.50 కోట్ల భారం పడు తోంది. మరోవైపు సోలార్​ప్లాంట్లను ఏర్పాటు చేయడంతో కొంత మేర భారం తగ్గుతుండగా.. లాభాలు కూడా వస్తున్నాయి. 

భూపాలపల్లి సోలార్​ప్లాంట్ ద్వారా ప్రతి నెల15 లక్షల యూనిట్స్ విద్యుత్ ఉత్పత్తి చేస్తూ చెల్పూర్​లోని 132 కేవీ సబ్​స్టేషన్​కు సప్లయ్​చేస్తోంది.  దీని ద్వారా ప్రతి నెల రూ.1.20 కోట్ల ఆదాయం వస్తోంది. మిగతా బిల్లులను ఎన్​పీడీసీఎల్​కు సింగరేణి చెల్లిస్తోంది.

3 ప్రాంతాల్లో  30 మెగావాట్ల ప్లాంట్లు 

సోలార్​ప్లాంట్లతో రూ. కోట్లలో ఆదా అవుతుండడంతో కొత్తగా 30 మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాటుకు సింగరేణికి అనుమతులు లభించగా.. అధికారులు పనులను ప్రారంభించారు. ఏడాదిలోపు ప్లాంటును వినియోగంలోకి   తెచ్చేందుకు స్పీడ్ గా పనులు కొనసాగిస్తున్నారు. ఇల్లందులో 15 మెగా వాట్లు, భూపాలపల్లిలో 10 మెగా వాట్లు, రామగుండంలో 5 మెగావాట్ల పాంట్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచారు.

 భూపాలపల్లి ఓసీ –2 ఏరియాలోని క్యాంపు ఆఫీసు సమీపంలోని 25 ఎకరాల్లో ప్లాంటు ఏర్పాటుకు భూమిని కేటాయించారు. చుట్టూ ఫెన్సింగ్ చేసి ప్లాంటు పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నా రు. ఏడాదిలో ప్లాంట్ల నిర్మాణం పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్లాన్​చేస్తున్నారు. భూపాలపల్లి పరిధిలోని కార్మికులు ఉండే రామప్ప కాలనీలో రూప్​సోలార్ల ఏర్పాటు చేపట్టారు. వీటిని రెండు నెలల్లో వినియోగంలోకి తెచ్చేలా పనులు నిర్వహిస్తున్నారు. 

బిల్లుల భారం తగ్గించుకుంటూ.. 

సోలార్​ప్లాంట్లతో సింగరేణికి కరెంట్ బిల్లుల భారం తగ్గుతోంది. 700 మిలియన్​ యూనిట్ల విద్యుత్ ను వినియోగిస్తుండగా ప్రతి ఏటా రూ. 450 కోట్లు చెల్లిస్తోంది. సోలార్​ప్లాంట్ల ద్వారా మరో 245 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. దీని ద్వారా సంస్థకు రూ. 225 కోట్లు ఆదాయం సమకూరుతోంది.

 మణుగూరు ఇల్లందు, కొత్తగూడెం, ఆర్జీ –3, మందమర్రి, భూపాలపల్లి, జైపూర్ లో సోలార్​ప్లాంట్ల ద్వారా విద్యుత్ ఉత్పతి చేస్తోంది. భవిష్యత్ లో విండ్ ఎనర్జీ, హైడల్​ఎనర్జీ కేంద్రాల ఏర్పాట్లపైనా దృష్టి సారించి, ప్లాంట్ల ఏర్పాటుకు అనువైన స్థలాల కోసం సింగరేణి అన్వేషిస్తోంది. 

ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నాం 

బొగ్గు నిల్వలు తగ్గుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నాం. సోలార్​ప్లాంట్లు విజయవంతంగా రన్​అవుతున్నాయి. పర్యావరణ రహిత విద్యుదుత్పత్తి కేంద్రాలతో ప్రకృతి వనరుల వినియోగంతో పాటు కాలుష్యాన్ని నియంత్రించవచ్చు. కొత్తగా ఏర్పాటు చేసే ప్లాంటు ఏడాది కాలంలో పూర్తి చేసి అందుబాటులోకి తెస్తాం. రూప్​సోలార్​పనులు కూడా స్పీడ్ గా కొనసాగుతున్నాయి. - మాల ఎర్రన్న, సోలార్​ జీఎం, భూపాలపల్లి