సాయి కృష్ణ దమ్మాలపాటి, గోపిక ఉదయన్ జంటగా ‘కేరింత’ ఫేమ్ సాయికిరణ్ అడివి తెరకెక్కిస్తున్న చిత్రం ‘పదహారు రోజుల పండుగ’. రేణు దేశాయ్, అనసూయ, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సురేష్ కుమార్ దేవత, హరిత దుద్దుకూరు, ప్రతిభ అడివి నిర్మిస్తున్నారు. బుధవారం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్ శేఖర్ కమ్ముల క్లాప్ కొట్టారు.
నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కెమెరా స్విచాన్ చేశారు. ఫస్ట్ షాట్‌కు డి. సురేష్ బాబు గౌరవ దర్శకత్వం వహించారు. కోన వెంకట్, కేకే రాధా మోహన్ నిర్మాతలకు స్క్రిప్ట్‌ను అందజేశారు. నిర్మాతలు అల్లు అరవింద్, మైత్రి రవి, దామోదర ప్రసాద్ హాజరై టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు. కృష్ణవంశీ సూచనతో ఈ టైటిల్ పెట్టామని డైరెక్టర్ సాయి కిరణ్ చెప్పారు. అత్తమ్మ పాత్ర పోషిస్తున్నట్టు రేణుదేశాయ్ తెలిపారు. అనసూయ, ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్, కొరియోగ్రాఫర్ జానీ పాల్గొన్నారు.
