2021 తర్వాతి నుంచి దేశంలో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. కరోనా సమయంలో మార్కెట్లు భారీగా పతనంతో ఆ తర్వాత వచ్చిన లాభాల నుంచి చాలా మంది ప్రేరణ పొందారు. అయితే నేరుగా ఇన్వెస్ట్ చేయకుండా మ్యూచువల్ ఫండ్స్ మార్గాన్ని ఎంచుకుని సిప్ రూపంలో చిన్న మెుత్తాల్లో పెట్టుబడి పెట్టడం స్టార్ట్ చేశారు. అయితే ప్రస్తుతం కొన్ని నెలలుగా సిప్ చెల్లింపులు నిలిపేస్తున్న వారి సంఖ్య ఎక్కువైంది. అయితే దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్న భారతీయులు చాలా తెలివైన వారని మూర్ఖులు కాదని హీలియోస్ క్యాపిటల్ వ్యవస్థాపకులు సమీర్ అరోరా చెప్పారు. ఈ మధ్య వచ్చిన ఒక వార్తలో భారతదేశంలో సిప్ బూమ్ వెనుక పెద్ద ప్రమాదం దాగి ఉందనే వార్తపై ఆయన స్పందించారు. వాస్తవానికి సిప్ నిలిపివేత పెరగటానికి కారణాన్ని వివరించారు. భారతదేశంలో మెుత్తం పెట్టుబడిదారుల సంఖ్య 5 కోట్లు ఉందని దీని ప్రకారం కొత్తగా 5 కోట్ల మంది ఇన్వెస్టర్లు రావటంతో పాతగా ఉన్న 4 కోట్ల మంది ఇన్వెస్టర్లు సిప్ మానేసినట్లు కాదన్నారు అరోరా. ఇక్కడ పెట్టుబడిదారులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పాత సిప్స్ ఆపేసి కొత్త ఫండ్లలో సిప్ స్టార్ట్ చేస్తున్నారని చెప్పారు.
వాస్తవానికి సెప్టెంబరులో సిప్ నిలిపేస్తున్న రేషియో 76.27గా ఉండగా.. అది అక్టోబరులో స్వల్పంగా తగ్గి 74.85కి చేరిందని వెల్లడించారు. అలాగే అక్టోబరులో సిప్ పెట్టుబడులు సరికొత్త గరిష్టమైన రూ.29వేల 529 కోట్లకు చేరుకుందని వెల్లడైంది. అలాగే అక్టోబరులో కొత్త సిప్ రిజిస్ట్రేషన్ల సంఖ్య 60లక్షల 25వేలకు చేరుకుందని చెప్పారు. దీని ప్రకారం ఇప్పటికీ భారతీయ ఇన్వెస్టర్లు డాలర్ ఖర్చు యావరేజింగ్ చేస్తున్నారని, అయితే అది వేరువేరు ఫండ్స్ ద్వారా చేస్తుండొచ్చని చెప్పారు సమీర్ అరోరా.
