WPL 2026 mega auction: స్టార్క్ భార్యకు తప్పని నిరాశ.. మెగా ఆక్షన్‌లో అన్ సోల్డ్ కావడంతో క్రికెట్ ఫ్యాన్స్ షాక్

WPL 2026 mega auction: స్టార్క్ భార్యకు తప్పని నిరాశ.. మెగా ఆక్షన్‌లో అన్ సోల్డ్ కావడంతో క్రికెట్ ఫ్యాన్స్ షాక్

ఢిల్లీలో గురువారం (నవంబర్ 27) ప్రారంభమైన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2026 సీజన్ మెగా వేలంలో ఆస్ట్రేలియా కెప్టెన్ అలిస్సా హీలీ అన్ సోల్డ్ గా మిగిలిపోవడం క్రికెట్ ప్రపంచాన్ని షాకింగ్ కు గురి చేసింది. వరల్డ్ కప్ ఛాంపియన్, వికెట్ కీపర్, కెప్టెన్, అనుభవం, అద్భుతమైన ట్రాక్ రికార్డ్స్ ఇలా ఎన్నో ఘనతలు ఈ ఆసీస్ కెప్టెన్ కు ఉన్నప్పటికీ ఎవరు కొనడానికి ముందుకు రాలేదు. మొత్తం 277 మంది ప్లేయర్స్ మెగా ఆక్షన్ లోకి వచ్చారు. ఇందులో 73 స్థానాల కోసం ప్లేయర్స్ పోటీ పడనున్నారు. 194 మంది భారత ప్లేయర్స్ ఉన్నారు. వీరిలో 52 మంది క్యాప్డ్ ప్లేయర్స్ ఉండగా, 142 మంది అన్‌ క్యాప్డ్ ప్లేయర్స్ ఉన్నారు. 

మెగా ఆక్షన్ కావడంతో స్టార్ ప్లేయర్స్ పై భారీ హైప్ నెలకొంది. ఈ లిస్ట్ లో హీలీ కూడా ఉంది. 50 లక్షల బేస్ ప్రైస్‌తో మెగా ఆక్షన్ లోకి వచ్చిన హీలీ మొదటి రౌండ్‌లోనే అమ్ముడుపోకుండా ఉండడం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్ ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నారు. గతంలో యూపీ వారియర్జ్‌కు కెప్టెన్సీ చేసిన హీలీ 2025 డబ్ల్యూపీఎల్ కు పాదం గాయం కారణంగా దూరమైంది. 

ఈ ఆసీస్ కెప్టెన్ ప్రస్తుతం ఫిట్ నెస్ సమస్యలు ఉండడంతో ఆమెపై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించలేదు. డబ్ల్యూపీఎల్ లో 17 మ్యాచ్‌ల్లో ఆడిన హీలీ 130.49 స్ట్రైక్ రేట్‌తో 428 పరుగులు చేసి రాణించింది. 2026 మెగా ఆక్షన్ కు ముందు ఆమెను యూపీ వారియర్స్ రిటైన్ చేసుకోకుండా రిలీజ్ చేసి షాక్ ఇచ్చింది. అయితే మెగా ఆక్షన్ లో కూడా హీలీని ఎవరు పట్టించుకోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. 

ఈ మెగా ఆక్షన్ లో ఇప్పటివరకు జరిగిన హైలెట్స్ చూస్తే.. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ దీప్తి శర్మకు భారీ ధర లభించింది. యూపీ వారియర్స్‌‌‌‌‌‌‌‌ ఈ ఆల్ రౌండర్ ను రూ. 3.2 కోట్లకు కొనుగోలు చేసింది. న్యూజిలాండ్ యంగ్ ఆల్ రౌండర్ అమేలియా కెర్ ను ముంబై ఇండియన్స్ రూ. 3 కోట్ల ధరకు సొంతం చేసుకుంది. ఇటీవలే బిగ్ బాష్ లీగ్ లో మెరుపు సెంచరీ చేసిన మెగ్ లానింగ్ ను 1.9 కోట్లకు యూపీ వారియర్స్‌‌‌‌‌‌‌‌ దక్కించుకుంది.భారత స్పిన్నర్ శ్రీ చరనికి మంచి ధర లభించింది. రూ. 1.3 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ఆఫ్ స్పిన్నర్ ను దక్కించుకుంది. 

సీనియర్ ప్లేయర్, గత సీజన్ లో ఆర్సీబీ జట్టుకు ఆడిన సోఫీ డివైన్ ను రూ. 2 కోట్లకు గుజరాత్ జెయింట్స్ కొనుగోలు చేసింది. ఇంగ్లాండ్ స్టార్ స్పిన్నర్ సోఫీ ఎక్లెస్టోన్ ను కూడా యూపీ వారియర్స్ దక్కించుకోవడం విశేషం. ఆస్ట్రేలియా ఓపెనర్ లిచ్‌ఫీల్డ్ ను కూడా యూపీ వారియర్స్ దక్కించుకుంది. వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియాపై సెంచరీ కొట్టిన ఈ ఆసీస్ ఓపెనర్ ను రూ.1.2 కోట్లకు కొనుగోలు చేసింది.