వైసీపీ పార్టీ రంగులు తొలగించమన్నాం కదా..? : ఏపీ హైకోర్టు

వైసీపీ పార్టీ రంగులు తొలగించమన్నాం కదా..? : ఏపీ హైకోర్టు

రాష్ట్రంలోని గ్రామ పంచాయితీ కార్యాలయాలపై వైసీపీ రంగులు  వేయడంపై ఇప్పటికే వివాదం నడుస్తోంది. ప్రభుత్వ భవనాలకు పార్టీల రంగులు వేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వాటిని తొలగించాలని ఆదేశించింది. అయితే, ప్రభుత్వం కరోనా వైరస్ కారణంగా వాటిని తొలగించే ప్రయత్నం చేయలేదు.

ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయాల రంగుల అంశంలో ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్‌ 623ను సవాల్‌ చేస్తూ న్యాయవాది సోమయాజులు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. పంచాయతీ భవనాలపై ఇప్పటికీ వైకాపా జెండాను పోలిన రంగులనే వేస్తున్నారని పిటిషనర్‌ తరపు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. రంగుల క్రమం కూడా జెండాను పోలి ఉందని న్యాయస్థానానికి తెలియజేశారు. స్పందించిన ఉన్నత న్యాయస్థానం.. భవనాలపై ఉన్న రంగులను తీసివేయమని గతంలోనే ఉత్తర్వులు జారీ చేశాం కదా? అని ప్రశ్నించింది.

అయితే పంచాయతీ భవనాలకు వేస్తున్న రంగులు ఏ ఉద్దేశంతో వేస్తున్నామో పూర్తి వివరాలు ఉత్తర్వుల్లో పేర్కొన్నామని ప్రభుత్వం తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. గతంలో వేసిన రంగులతో పాటు అదనంగా మరో రంగు కలిపి వేస్తున్నట్లు వివరించారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.