ఏపీ సర్కార్‌కు హైకోర్టులో చుక్కెదురు

ఏపీ సర్కార్‌కు హైకోర్టులో చుక్కెదురు

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం గతంలో ఇచ్చిన జీవోను రద్దు చేస్తూ న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదంటూ సుప్రీం కోర్టు జారీ చేసిన మార్గదర్శకాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. నాలుగు వారాల్లోగా రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించింది.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రెండు నెలల క్రితం రిజర్వేషన్లు ఖరారు చేసింది ప్రభుత్వం. అయితే 59.85 శాతం రిజర్వేషన్‌ ఇస్తూ జగన్ సర్కారు జీవో ఇవ్వడంతో కొందరు దీనిపై హైకోర్టును ఆశ్రయించారు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వడం సుప్రీం మార్గదర్శకాలకు వ్యతిరేకమంటూ పిటిషన్ వేశారు. విచారణకు స్వీకరించిన హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై స్టే ఇచ్చింది. దీనిపై సోమవారం మరోసారి విచారణ తర్వాత పాత జీవోను రద్దు చేసింది న్యాయస్థానం. నెలలోపు 50 శాతం దాటకుండా రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఆదేశించింది. ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని సూచించింది.