గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

అమ‌రావ‌తి: ఎల్జీ పాలిమర్స్‌లో స్టైరిన్‌ గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కంపెనీ ప్రాంగణాన్ని సీజ్‌ చేసి ఉంచాలని ఆదేశించింది. కంపెనీలోకి ఎవరినీ అనుమతించొద్దని తెలిపింది. అనుమతి లేకుండా కంపెనీ డైరెక్టర్లు దేశం విడిచి వెళ్లొద్దని ఆదేశాల్లో పేర్కొంది. కంపెనీ డైరెక్టర్లు వారి పాస్‌పోర్టులు స్వాధీనపరచాలని ఆదేశాలు జారీ చేసింది. గ్యాస్‌ లీక్‌ దుర్ఘటనను సుమోటోగా తీసుకున్న ఉన్నత న్యాయస్థానం తాజాగా విచారణ జరిపింది. ఈ మేరకు విచారణకు సంబంధించి ఆదివారం లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసింది.

ఎల్‌జీ పాలిమర్స్, ప్రభుత్వం తరఫున న్యాయవాదులు న్యాయస్థానానికి వారి వాదనలు వినిపించారు. గ్యాస్‌ లీకేజీ జరిగిన తర్వాత స్టైరీన్‌ను ఎవరి అనుమతితో ఇక్కడ నుంచి తరలించారని.. లాక్‌డౌన్‌ తర్వాత ఎవరి అనుమతితో ప్రక్రియ ప్రారంభించారని ప్రశ్నించింది. పూర్తి సమాచారంతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీ యాజమాన్యం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసింది.